రేసింగ్‌పై ఆసక్తి ఉన్న చిన్నారులను దృష్టిలో పెట్టుకుని టీవీఎస్ రేసింగ్ కొత్తగా ‘అపాచీ ఆర్‌ఆర్ 200 మినీ’ని ఆవిష్కరించింది. 10 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులకు నియంత్రిత వాతావరణంలో మోటార్‌సైకిల్ రేసింగ్‌లో శిక్షణ ఇవ్వాలనే లక్ష్యంతో ఈ బైక్‌ను రూపొందించింది. టీవీఎస్ అపాచీ జూనియర్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ బైక్‌లను వినియోగించనున్నారు. ఇప్పటికే 10 బైక్‌లను ‘మద్రాస్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ (ఎంఎంఎస్‌సీ)’కు సంస్థ అందజేసింది. ‘మద్రాస్ ఇంటర్నేషనల్ కార్టింగ్’ ఆవరణలో శిక్షణ ఇవ్వనున్నారు.

ఈ బైక్‌లో ఆర్‌టీఆర్ 200 4వీలో ఉండే 197.75 సీసీ ఇంజిన్‌ను ప్రత్యేకంగా ట్యూన్ చేసి అమర్చారు. ఇది 9,500 ఆర్‌పీఎం వద్ద 23 పీఎస్ శక్తి, 6,500 ఆర్‌పీఎం వద్ద 20.1 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రోగ్రామబుల్ టీసీఐ ఇగ్నిషన్ సిస్టమ్, రేసింగ్‌కు అనుకూలంగా రూపొందించిన ఫ్రీ ఫ్లో ఎగ్జాస్ట్‌ను అమర్చారు. కేవలం 90 కిలోల బరువు మాత్రమే ఉండే ఈ బైక్ గరిష్ఠంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతుందని టీవీఎస్ తెలిపింది.

రేసింగ్ అవసరాలకు అనుగుణంగా ఇందులో అత్యాధునిక సస్పెన్షన్, బ్రేకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 35 ఎంఎం అప్‌సైడ్ డౌన్ ఫోర్క్, వెనుక రేస్ షాక్ అబ్జార్బర్ ఇచ్చారు. రీబౌండ్, కంప్రెషన్, ప్రీలోడ్ సర్దుబాటు చేసుకునే సదుపాయం ఇందులో ఉంది. ముందుభాగంలో 220 ఎంఎం డిస్క్, వెనుక 180 ఎంఎం డిస్క్ బ్రేక్‌లు అమర్చారు. 12 అంగుళాల వీల్స్‌తో పాటు రేస్ కాంపౌండ్ యూరోగ్రిప్ బీఈఈ టైర్లను వినియోగించారు.

ఈ బైక్‌ను యువ రేసర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. సీటు ఎత్తు 690 ఎంఎంగా ఉండటంతో చిన్నారులు సులభంగా నడపగలుగుతారు. తక్కువ బరువున్న ఏరోడైనమిక్ బాడీ, సీఎన్‌సీ అల్యూమినియం ట్రిపుల్ క్లాంప్, ప్రత్యేక అల్యూమినియం ఫ్యూయల్ ట్యాంక్ వంటి రేసింగ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్‌లో శిక్షణ పొందిన వారు 15 ఏళ్ల తర్వాత టీవీఎస్ వన్ మేక్ ఛాంపియన్‌షిప్ రూకీ విభాగంలోకి, ఆ తర్వాత ఆర్‌ఆర్ 310 ఎక్స్‌పర్ట్ విభాగానికి చేరుకునే అవకాశం ఉంటుందని సంస్థ తెలిపింది.