జపాన్‌లోని దక్షిణ ప్రాంతాన్ని మంగళవారం మధ్యాహ్నం భారీ భూకంపం వణికించింది. క్యుషు ద్వీపంలోని కుమమోటో ప్రిఫెక్చర్‌లో రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. దీంతో జపాన్ వాతావరణ సంస్థ వెంటనే తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది.

స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఈ భూకంపం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. కుమమోటో నగర సమీప ప్రాంతం కేంద్రంగా, భూమికి 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు నమోదయ్యాయి. అరియాకే, యత్సుషిరో సముద్ర తీరాల్లో సుమారు ఒక మీటర్ ఎత్తున అలలు ఎగిసిపడే ముప్పు ఉందని, ప్రజలందరూ తీరానికి దూరంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరించారు.

భూకంపం కారణంగా కుమమోటో ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. భద్రతా కారణాల దృష్ట్యా బుల్లెట్ రైళ్లతో సహా అన్ని రైలు సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు. క్వుషు ద్వీపంలోని కుమమోటో, నాగసాకి, కగోషిమా, ఫుకుయోకా, సాగా, ఒయిటా, మియాజాకి ప్రాంతాల్లో జపాన్ ప్రభుత్వం తదుపరి అత్యవసర భూకంప హెచ్చరికలను జారీ చేసింది.

జపాన్‌లో ప్రతి ఏటా వందలాది భూకంపాలు సంభవిస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా సంభవించే భూకంపాలలో దాదాపు 18 శాతం జపాన్‌లోనే నమోదవుతుంటాయి. వీటిలో అత్యధిక శాతం స్వల్ప తీవ్రత కలిగినవే అయినప్పటికీ, కొన్నిసార్లు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. 2011లో రిక్టర్ స్కేలుపై 9.0 తీవ్రతతో సంభవించిన వినాశకర భూకంప వల్ల సుమారు 18,500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ఏప్రిల్ 20న జపాన్ ఉత్తర ప్రాంతంలో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే.