భూ యజమాని జీవించి ఉండగానే, ఆయన మరణించినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి, కోట్ల రూపాయల విలువైన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్న ఫోర్జరీ కేసులో మాజీ స్పీకర్, వైసీపీ నేత తమ్మినేని సీతారాం కుటుంబానికి హైకోర్టులో మిశ్రమ ఫలితం ఎదురైంది. ఆయన కుమారుడు వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చగా, తమ్మినేని సీతారాం మరియు ఆయన భార్య వాణిశ్రీకి మాత్రం తాత్కాలిక ఊరట లభించింది.

తనకు చెందిన సుమారు రూ. 4 కోట్ల విలువైన స్థలాన్ని ఫోర్జరీ పత్రాలతో కబ్జా చేశారని శ్రీకాకుళానికి చెందిన కట్టా జయకిశోర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఐదో నిందితుడిగా (A5) ఉన్న చిరంజీవి నాగ్, అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ వై. లక్ష్మణరావు, నాగ్ అభ్యర్థనను తిరస్కరించారు. ఆయనపై ఉన్న ఆరోపణలు తీవ్రమైనవని, తాను కొనుగోలు చేసినట్లు చెబుతున్న మూడు ప్లాట్లకు సంబంధించి నగదు చెల్లింపుల ఆధారాలను సమర్పించడంలో ఆయన విఫలమయ్యారని న్యాయస్థానం ఈ సందర్భంగా అభిప్రాయపడింది.

అదే సమయంలో, ఈ కేసులో ఆరో, ఏడో నిందితులుగా (A6, A7) ఉన్న తమ్మినేని సీతారాం, వాణిశ్రీలకు హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వీరిపై నిర్దిష్టమైన ఆరోపణలు లేకపోవడంతో పాటు, గతంలో దాఖలైన సివిల్ దావాలో వీరిని ప్రతివాదులుగా చేర్చని అంశాలను పరిగణనలోకి తీసుకుని కోర్టు ఈ నిర్ణయం వెలువరించింది. ఈ నెల 29వ తేదీ ఉదయం 10 గంటలకు దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలని తమ్మినేని సీతారాంను ఆదేశించిన న్యాయస్థానం, విచారణకు సహకరించని పక్షంలో బెయిల్ రద్దు చేస్తామని స్పష్టం చేసింది. ప్రధాన బెయిల్ పిటిషన్లపై తదుపరి విచారణను ఆగస్టు 17కు వాయిదా వేసింది.