తన పెనమలూరు పర్యటనలో అంగన్‌వాడీ కార్యకర్తలు నిరసన తెలిపారంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలపై ఏపీ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు 'అమ్మ ఒడి' పథకాన్ని నిరాకరించి తీవ్ర ద్రోహం చేశారని ఆయన మండిపడ్డారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వం అంగన్‌వాడీల పిల్లలకు కూడా 'తల్లికి వందనం' పథకాన్ని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకోవడంతో... వారు సంతోషంతో తనకు ధన్యవాదాలు తెలిపేందుకు ర్యాలీగా వచ్చారని లోకేశ్ స్పష్టం చేశారు. అంగన్‌వాడీలు తెలిపిన కృతజ్ఞతా ప్రదర్శనను వైసీపీ నేతలు వికృత ఆలోచనలతో నిరసనగా చిత్రీకరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియా వేదికగా అసలైన చిత్రాలు, వైసీపీ తప్పుడు ప్రచారం చేసిన ఫోటోలను పంచుకున్న లోకేశ్... విపక్షాల 'ఫేక్ న్యూస్' ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజలకు, అంగన్‌వాడీలకు మేలు జరుగుతుంటే ఓర్వలేకనే ప్రతిపక్షం ఇలాంటి అసత్య ప్రచారాలకు ఒడిగడుతోందని విమర్శించారు.
