ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సంసిద్ధత విషయంలో భారత కంపెనీలు ప్రపంచ సగటును మించి దూసుకెళ్తున్నాయని, అయితే ఏఐకి అనుగుణంగా తమ కార్యాలయాలను మార్చుకోవడంలో మాత్రం వెనుకబడి ఉన్నాయని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ జేఎల్ఎల్ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఏఐ వల్ల ఆఫీసుల్లో మార్పులు అవసరమని 77 శాతం భారతీయ వ్యాపార నాయకులు గుర్తిస్తున్నప్పటికీ, కేవలం 19 శాతం కంపెనీలు మాత్రమే ఆ దిశగా చర్యలు ప్రారంభించాయి. ఆలోచనకు, ఆచరణకు మధ్య 58 పాయింట్ల భారీ వ్యత్యాసం ఉన్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది.
21 దేశాల్లో 2,200 మంది సీఈవోలు, సీఎఫ్‌వోలు, రియల్ ఎస్టేట్ హెడ్‌లతో జరిపిన సర్వే ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఏఐ సంబంధిత 8 కీలక కొలమానాల్లోనూ భారత కంపెనీలు ప్రపంచ సగటు కంటే మెరుగైన స్కోరు సాధించాయి. ఏఐ వల్ల ఉద్యోగాలు పోవని, కొత్త ఉద్యోగాలు వస్తాయని భారత వ్యాపారవేత్తలు బలంగా నమ్ముతున్నారు. రాబోయే 3-5 ఏళ్లలో 58 శాతం మంది తమ సంస్థల్లో ఉద్యోగుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తుండగా, 62 శాతం మంది ఏఐ వల్ల మానవ వనరుల పాత్ర తొలగిపోదని, పైగా వారి విలువ మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
గత 15 ఏళ్లలో తొలిసారిగా కంపెనీలకు బడ్జెట్ కంటే నైపుణ్యాల కొరతే పెద్ద అడ్డంకిగా మారిందని నివేదిక హైలైట్ చేసింది. 46 శాతం భారతీయ కంపెనీలు నైపుణ్యాల కొరతను ప్రధాన సమస్యగా పేర్కొనగా, కేవలం 35 శాతం మాత్రమే బడ్జెట్‌ను కారణంగా చూపాయి. "ఇది ఒక సానుకూల మలుపు. ఎందుకంటే బడ్జెట్ కేటాయింపుల కోసం వేచిచూడటం కంటే, నైపుణ్యాలను అంతర్గతంగా అభివృద్ధి చేయడం లేదా బయటి నుంచి పొందడం సులభం" అని జేఎల్ఎల్ వర్క్ డైనమిక్స్ అకౌంట్స్ ఎండీ అజిత్ కుమార్ వివరించారు.
ఏఐ ట్రెండ్స్‌ను ట్రాక్ చేయడంలో ప్రపంచ సగటు 46 శాతం ఉండగా, భారత్‌లో 56 శాతం కంపెనీలు ముందున్నాయి. అలాగే ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడంలో గ్లోబల్ యావరేజ్ 36 శాతం కాగా, భారత్‌లో 45 శాతంగా ఉంది. రియల్ ఎస్టేట్ కార్యకలాపాల్లో ఏఐ వినియోగంలో 19 శాతం భారత కంపెనీలు అత్యంత ఆధునిక దశకు చేరుకున్నాయని, ఇది ప్రపంచ సగటు 15 శాతం కంటే ఎక్కువని నివేదిక పేర్కొంది. బడ్జెట్ సమస్యగా చూడకుండా, నైపుణ్యాభివృద్ధిని ఒక సవాల్‌గా స్వీకరించి పెట్టుబడులు పెట్టే కంపెనీలే రాబోయే దశాబ్దంలో భారత వర్క్‌ప్లేస్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ను నిర్దేశిస్తాయని అజిత్ కుమార్ అన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంసిద్ధతలో ప్రపంచ కంపెనీలను మించిన భారత్..
