హైదరాబాద్ జాతీయ పోలీస్ అకాడమీలో సంచలనం సృష్టించిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, తాను ఎక్కడికీ పారిపోలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం తన సొంత ఊరు ఊళ్లపాలెంలోనే ఉన్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఉదయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. చట్టంపై తనకు పూర్తి నమ్మకం ఉందని, పోలీసుల విచారణకు సంపూర్ణంగా సహకరిస్తానని చెప్పారు. తన నాన్నమ్మకు ఆరోగ్యం బాగోలేకపోవడంతోనే సొంతూరుకు వచ్చినట్లు వివరించారు. పోలీసులు వెతికినవి తన తాత్కాలిక చిరునామాలు అని పేర్కొన్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున దీనిపై ఎక్కువగా మాట్లాడలేనని అన్నారు. త్వరలోనే విచారణ అధికారులను కలిసి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని ధీమా వ్యక్తం చేశారు.

జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న తనను ఉదయ్ కృష్ణారెడ్డి లైంగికంగా వేధించారంటూ ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుతో కేసు నమోదు కావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.