స్మార్ట్‌ఫోన్లు, ఆడియో ఉత్పత్తులతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నథింగ్ ఇప్పుడు స్మార్ట్‌వాచ్ మార్కెట్‌లోకి అడుగుపెట్టే అవకాశం కనిపిస్తోంది. కంపెనీ తన ప్రధాన బ్రాండ్ పేరుతో తొలి స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేయనున్నట్లు పరిశ్రమ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు నథింగ్ వేరబుల్స్‌ను సీఎంఎఫ్ సబ్‌బ్రాండ్ ద్వారానే తీసుకొచ్చింది. ఇప్పుడు నేరుగా నథింగ్ బ్రాండ్‌తో వాచ్ తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం.. ఈ స్మార్ట్‌వాచ్ సెప్టెంబరులో విడుదలయ్యే అవకాశం ఉంది. నథింగ్ ఉత్పత్తులకు ఉండే పారదర్శక డిజైన్ శైలినే ఇందులోనూ కొనసాగించే అవకాశముంది. ధర రూ.28,700లోపు ఉండొచ్చని అంచనా. అయితే ఈ వాచ్‌ను తొలి దశలో కొన్ని మార్కెట్లలో మాత్రమే విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. దీనిపై నథింగ్ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ప్రస్తుతం నథింగ్‌కు చెందిన సీఎంఎఫ్ సిరీస్‌లో సీఎంఎఫ్ వాచ్ ప్రో, సీఎంఎఫ్ వాచ్ ప్రో 2, సీఎంఎఫ్ వాచ్ 3 ప్రో మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. తాజా సీఎంఎఫ్ వాచ్ 3 ప్రోను భారత్‌లో ఈ ఏడాది మేలో రూ.7,999 ధరతో విడుదల చేశారు. ఇందులో 1.43 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే, 120కు పైగా వాచ్ ఫేస్‌లు ఉన్నాయి.

అలాగే బ్లూటూత్ కాలింగ్, చాట్‌జీపీటీ ఇంటిగ్రేషన్, వాయిస్ రికార్డింగ్, ట్రాన్స్‌క్రిప్షన్, గెశ్చర్ కంట్రోల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 131 వర్కౌట్ మోడ్‌లు, డ్యూయల్ బ్యాండ్ జీపీఎస్, హార్ట్‌రేట్, బ్లడ్ ఆక్సిజన్, నిద్ర, ఒత్తిడి, మహిళల ఆరోగ్య ట్రాకింగ్ వంటి హెల్త్ ఫీచర్లను కూడా అందించారు. 350 ఎంఏహెచ్ బ్యాటరీతో సాధారణ వినియోగంలో 13 రోజుల బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.