ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య రంగంలో మరో కీలక ముందడుగు పడింది. అంతర్జాతీయ ఫార్మా, బయోటెక్ దిగ్గజ సంస్థలైన ఆస్ట్రాజెనెకా, స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్, క్యూర్ ఏఐ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం కీలక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందంలో భాగంగా, అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ప్రెసిషన్ ఆంకాలజీ విధానాన్ని ప్రారంభించనున్నారు.
ఈ ఒప్పందం ప్రకారం ఆస్ట్రాజెనెకా ఇండియా, అమరావతిలో 'ఇంటిగ్రేటెడ్ జెనోమిక్ సొల్యూషన్స్ సెంటర్'ను ఏర్పాటు చేయనుంది. ఈ కేంద్రం ద్వారా ముఖ్యంగా ఊపిరితిత్తులు, రొమ్ము కేన్సర్ రోగులకు అవసరమైన అధునాతన జన్యు పరీక్షలు, బయోమార్కర్ టెస్టింగ్ సేవలను అందిస్తారు. దీనివల్ల కేన్సర్ చికిత్సలో కచ్చితమైన, వేగవంతమైన ఫలితాలు సాధించేందుకు వీలు కలుగుతుంది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలందరికీ అందుబాటు ధరల్లో అత్యాధునిక వైద్య సదుపాయాలు తీసుకురావడమే ఈ ఒప్పందం లక్ష్యమని పేర్కొన్నారు. కేవలం వైద్య సేవలే కాకుండా, ఫార్మా, బయోటెక్నాలజీ రంగాల్లో క్వాంటం స్థాయి పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ఈ ఒప్పందంతో ఏపీ ఆరోగ్య, పరిశోధన రంగాలకు కొత్త ఊపు వస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
ఏపీ ప్రభుత్వంతో ఆస్ట్రాజెనెకా, ఇతర దిగ్గజ సంస్థల ఒప్పందం..
