ముఖ్యమంత్రి చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో తన పర్యటనను రెండో రోజు కొనసాగించారు. ఈ సందర్భంగా ఆమె పలు అభివృద్ధి, సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి, స్విమ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కేంద్రాన్ని, టీఎన్‌ఎస్ఎఫ్ నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ.. క్యాన్సర్ మహమ్మారిపై మహిళల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ ఏర్పాటు చేసిన స్విమ్స్ ప్రతినిధులను అభినందించారు. ముందస్తు జాగ్రత్తలు, చైతన్యం ద్వారా క్యాన్సర్ ముప్పు నుంచి మహిళలను కాపాడవచ్చని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కూడా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని, ముఖ్యంగా తలసీమియా వ్యాధిగ్రస్త పిల్లలకు ఉచితంగా సురక్షితమైన రక్తాన్ని అందిస్తూ అండగా నిలుస్తున్నామని వివరించారు.
కుప్పం అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టారని భువనేశ్వరి అన్నారు. గతంలో ఇక్కడి నుంచి ఉపాధి కోసం యువత కర్ణాటకకు వలస వెళ్లేవారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుందని భరోసా ఇచ్చారు. సీఎం చంద్రబాబు ఒకేసారి కుప్పానికి 30 పరిశ్రమలు తీసుకువచ్చారని, వీటి ద్వారా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు.
అనంతరం రాజకీయ అంశాలపై మాట్లాడుతూ.. డీఎస్సీ నిర్వహణపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. కుప్పం ప్రజలు తనను ఎంతో ఆదరిస్తున్నారని, వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
కుప్పంలో రెండో రోజు పర్యటించిన నారా భువనేశ్వరి..
