పాకిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారీఖ్, తన బౌలింగ్‌లో అవుటైన ప్రతిసారీ బ్యాటర్లు తన బౌలింగ్ యాక్షన్‌ను ప్రశ్నించడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఇలాంటివి పునరావృతం కాకుండా అంపైర్లు, మ్యాచ్ రిఫరీలు చర్యలు తీసుకోవాలని కోరాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో జరుగుతున్న 'ది హండ్రెడ్' లీగ్‌లో బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ తరఫున ఆడుతున్న ఉస్మాన్, ట్రెంట్ రాకెట్స్ బ్యాటర్ టిమ్ డేవిడ్‌ను అవుట్ చేశాడు. ఆ సమయంలో డేవిడ్, ఉస్మాన్ యాక్షన్‌ను తప్పుబడుతూ నో బాల్ కోసం సైగ చేయడం వివాదానికి దారితీసింది.

ఈ ఘటనపై ఉస్మాన్ స్పందిస్తూ.. "బౌలింగ్ యాక్షన్ సక్రమంగా ఉందో లేదో చూడాల్సింది అంపైర్లు, మ్యాచ్ రిఫరీలు. ఆ పని చేయడం బ్యాటర్లది కాదు. అంపైర్ నన్ను బౌలింగ్ చేయడానికి అనుమతించారంటే నా యాక్షన్ నిబంధనల ప్రకారమే ఉందని అర్థం. కానీ, అవుటైన ప్రతి బ్యాటర్ ఇలా చేయడం బాధ కలిగిస్తోంది" అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదని ఉస్మాన్ గుర్తుచేశాడు. "దుబాయ్‌లో జరిగిన ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో ఇంగ్లండ్ ఆటగాడు టామ్ బాంటన్ కూడా ఇలాగే ప్రవర్తించాడు. అప్పుడు అతడిని అవుట్ చేశాక నా అసహనాన్ని స్పష్టంగా తెలియజేశాను. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ కూడా ఓ టీ20 మ్యాచ్‌లో నా యాక్షన్‌ను ప్రశ్నించాడు" అని వివరించాడు.

గతంలో పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) సందర్భంగా తన యాక్షన్‌పై ఫిర్యాదు చేసిన‌ప్ప‌టికీ, ఐసీసీ క్లియరెన్స్ ఇచ్చిందని ఉస్మాన్ స్పష్టం చేశాడు. భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా గతంలో ఉస్మాన్ యాక్షన్‌కు మద్దతుగా మాట్లాడాడు. బంతి వేసేముందు కాసేపు ఆగే అతని యాక్షన్ నిబంధనలకు లోబడే ఉందని, పైగా అలా బౌలింగ్ చేయడం చాలా కష్టమని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.

ఇకనైనా ఇది ఆగాలి. టీ20 క్రికెట్‌లో స్పిన్నర్లపై ఏమాత్రం దయ చూపరు. అందుకే నా బౌలింగ్‌లో వైవిధ్యం కోసం చాలా కష్టపడతాను. నా శ్రమను గుర్తించాలి. కానీ, ఇలా అనుమానించడం సరికాదు" అని ఉస్మాన్ తారీఖ్ ఆవేదన వ్యక్తం చేశాడు. 'ది హండ్రెడ్' లీగ్‌లో అబ్రార్ అహ్మద్ తర్వాత పాకిస్థాన్ నుంచి ఆడుతున్న ఏకైక ఆటగాడు ఉస్మాన్ కావడం గమనార్హం.