భారత్‌లో తన కార్యకలాపాలను టెస్లా మరింత విస్తరిస్తోంది. అమ్మకాల తర్వాత అందించే సేవలను బలోపేతం చేసే దిశగా మహారాష్ట్రలోని పుణేలో తొలి ఆథరైజ్డ్ బాడీ షాప్‌ను ప్రారంభించింది. ఇదే సమయంలో 2026 మోడల్ ‘వై’ ప్రీమియం రియర్ వీల్ డ్రైవ్, మోడల్ వై ఎల్ వాహనాలకు టెస్ట్ డ్రైవ్‌లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.
పుణేలో ప్రారంభించిన ఆథరైజ్డ్ బాడీ షాప్ ద్వారా మహారాష్ట్రలోని టెస్లా వినియోగదారులకు సర్వీస్ సపోర్ట్ అందించనుంది. ఒరిజినల్ విడిభాగాలు, ప్రత్యేక శిక్షణ పొందిన సాంకేతిక నిపుణులు, టెస్లా ప్రమాణాలకు అనుగుణంగా ప్రమాదాల్లో దెబ్బతిన్న వాహనాల మరమ్మతులు, నిర్వహణ సేవలు ఈ కేంద్రంలో అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.
ఈ కేంద్రంలో బాడీ రిపేర్లు, సాఫ్ట్‌వేర్ ఆధారిత డయాగ్నస్టిక్స్, ఒరిజినల్ టెస్లా స్పేర్ పార్ట్స్‌తో మరమ్మతులు చేపడతామని పేర్కొంది. దీంతో వాహన భద్రత, పనితీరు మెరుగ్గా ఉండటంతో పాటు వినియోగదారులకు తక్కువ సమయంలోనే సేవలు అందుతాయని వివరించింది.
పుణేతో పాటు సమీప ప్రాంతాల వినియోగదారుల కోసం 2026 మోడల్ ‘వై’ ప్రీమియం రియర్ వీల్ డ్రైవ్, ‘మోడల్ వై ఎల్’ వాహనాల టెస్ట్ డ్రైవ్‌లను కూడా ప్రారంభించింది. ఆసక్తి ఉన్నవారు టెస్లా అధికారిక వెబ్‌సైట్ లేదా కస్టమర్ సపోర్ట్ ద్వారా ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని తెలిపింది.
మోడల్ వై ప్రీమియం రియర్ వీల్ డ్రైవ్ ప్రారంభ ధర రూ.50.89 లక్షలు. ఒక్కసారి పూర్తి ఛార్జింగ్‌తో గరిష్ఠంగా 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంది. 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని 5.9 సెకన్లలో అందుకుంటుంది. 2,138 లీటర్ల వరకు లగేజ్ సామర్థ్యం ఉంది. ఈ మోడల్ డెలివరీలు జులై నుంచే ప్రారంభం కానున్నాయి.
మరోవైపు కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మూడు వరుసల సీట్లు, ఆరు సీట్ల సామర్థ్యంతో మోడల్ వై ఎల్‌ను తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ.61.99 లక్షలు. ఒక్కసారి ఛార్జింగ్‌తో 681 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం ఉంది. 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని ఐదు సెకన్లలో చేరుకుంటుంది. 2,539 లీటర్ల వరకు లగేజ్ స్పేస్ అందుబాటులో ఉంటుంది. భారత్‌లో వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగానే ఈ విస్తరణ చేపట్టినట్లు టెస్లా తెలిపింది.
పుణేలో తొలి టెస్లా ఆథరైజ్డ్ బాడీ షాప్ మోడల్ ‘వై’ టెస్ట్ డ్రైవ్‌ల ప్రారంభం..
