ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా (Meta)పై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌లో తన సోషల్ మీడియా ఖాతాపై ఆంక్షలు విధించడంపై ఆయన మండిపడ్డారు. తన అకౌంట్‌ను ఎందుకు నిలిపివేశారో తెలుసుకునేందుకు మెటా ఇండియా కార్యాలయాన్ని సంప్రదించినా, ఈమెయిల్స్ పంపినా కేవలం సాధారణ రసీదులు తప్ప ఎటువంటి స్పష్టమైన సమాధానం రావడం లేదని ఆయన ఆరోపించారు. మెటా అందిస్తున్న ఈ అరకొర సేవలు అత్యంత పేలవంగా ఉన్నాయని విమర్శించారు.

 

"ప్రధాని మోదీ ఇచ్చే ఒత్తిళ్లకు మెటా సంస్థ అంతగా తలవంచకూడదు. లేకపోతే భవిష్యత్తులో భారత్‌లో కేవలం ప్రధాని ఒకరి ఖాతాను మాత్రమే నడుపుకోవడానికి అనుమతిస్తారు" అంటూ కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. పౌర హక్కులు, వాక్‌స్వాతంత్ర్యాన్ని రక్షించేలా మెటా తన సేవలను మరింత బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని ఆయన సూచించారు. కాగా, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై కేంద్ర ప్రభుత్వ నిఘా పెరిగిన నేపథ్యంలో కేజ్రీవాల్ చేసిన ఈ వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.