టాటా మోటార్స్ భారత మార్కెట్‌లో నెక్సాన్ కామో ఎడిషన్‌ను విడుదల చేసింది. ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధరను రూ.9.99 లక్షలుగా నిర్ణయించింది. పరిమిత కాలం పాటు మాత్రమే ఈ స్పెషల్ ఎడిషన్ అందుబాటులో ఉండనుంది. క్రియేటివ్‌, అంతకంటే పై వేరియంట్ల ఆధారంగా దీన్ని తీసుకొచ్చింది. పెట్రోల్‌, డీజిల్‌, సీఎన్‌జీ ఇంజిన్ ఎంపికలు యథాతథంగా కొనసాగించగా.. డిజైన్‌, టెక్నాలజీలో కొన్ని మార్పులు చేసింది.

స్పెషల్ ఎడిషన్‌లో మున్నార్ మిస్ట్‌, కూర్గ్ క్లౌడ్ అనే రెండు కొత్త రంగులు అందిస్తోంది. ముందు ఫెండర్లపై కామో బ్యాడ్జింగ్ ఇచ్చి ప్రత్యేక గుర్తింపును కల్పించింది. లోపల ముందు సీట్ల హెడ్‌రెస్ట్‌లపై కామో పెర్ఫొరేషన్ డిజైన్ కనిపిస్తుంది.

ఈ ఎడిషన్‌లో ప్రధాన ఆకర్షణ 12.3 అంగుళాల హార్మన్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్. సాధారణ మోడల్‌లో ఉన్న 10.25 అంగుళాల స్క్రీన్ స్థానంలో దీన్ని అమర్చింది. 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మాత్రం యథావిధిగా కొనసాగుతోంది. 360 డిగ్రీల కెమెరాతో అనుసంధానమైన ఇన్‌బిల్ట్ డ్యాష్‌క్యామ్‌ను కూడా అందించింది. ప్రయాణాల రికార్డింగ్‌కు ఇది ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది.

వేరియంట్‌ను బట్టి పానోరమిక్ సన్‌రూఫ్‌, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, జేబీఎల్ 9-స్పీకర్ ఆడియో సిస్టమ్‌, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్‌, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉన్నాయి. టాప్ వేరియంట్లలో 360 డిగ్రీల కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటరింగ్‌, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్‌) కూడా లభిస్తాయి.

1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 120 హెచ్‌పీ శక్తి, 170 ఎన్‌ఎం టార్క్ అందిస్తుంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 115 హెచ్‌పీ, 260 ఎన్‌ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. సీఎన్‌జీ వెర్షన్ 100 హెచ్‌పీ శక్తి, 170 ఎన్‌ఎం టార్క్ ఇస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్‌, ఏఎంటీ, 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్‌ ఉన్నాయి.