ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి నియమితులవుతున్నారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన వ్యక్తిగత బృందం స్పష్టం చేసింది. ఇవన్నీ కేవలం నిరాధారమైన వదంతులని, వీటిని ఎవరూ నమ్మవద్దని కోరింది. ఈ మేరకు గురువారం 'టీమ్ మెగాస్టార్ చిరంజీవి' సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' ద్వారా ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.

"మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్‌గా బాధ్యతలు చేపడుతున్నారనే ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దు, అలాగే వ్యాప్తి చేయవద్దు. ధ్రువీకరించని అవాస్తవ సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవద్దు" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

గత కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక రంగం, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చిరంజీవిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించనుందంటూ సోషల్ మీడియాలో, కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు వెలువడ్డాయి. గతంలో గుజరాత్ పర్యాటక రంగానికి అమితాబ్ బచ్చన్ ప్రచారం చేసిన తరహాలోనే, ఏపీకి చిరంజీవిని ఎంపిక చేయవచ్చని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి బృందం స్పందిస్తూ ఆ పుకార్లకు అడ్డుకట్ట వేసింది.

ప్రస్తుతం చిరంజీవి తన సినీ ప్రాజెక్టులపైనే పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. వశిష్ట దర్శకత్వంలో ఆయన నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం 'విశ్వంభర' అక్టోబర్ 16న దసరా కానుకగా విడుదల కానుంది. మరోవైపు, బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'మెగా 158' చిత్ర టైటిల్ టీజర్‌ను ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసేందుకు చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది.