ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా తీవ్రస్థాయిలో హెచ్చరించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ నేతలు చేపట్టిన నిరాహార దీక్ష వద్ద చోటుచేసుకున్న పరిణామాలపై ఆయన ఘాటుగా స్పందించారు. డీఎస్సీ నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు చేయడంపై మండిపడిన ఆయన... అసలు అక్రమాలపై చర్చకు రమ్మంటే వైసీపీ నేతలు పారిపోయారని ఎద్దేవా చేశారు.

 

పోలీసుల అనుమతి లేకుండా రోడ్డుపై కూర్చుని చంద్రబాబు, లోకేశ్‌లను బూతులు తిడితే సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. "శాంతియుతంగా నిరసన తెలపాలనుకుంటే ధర్నా చౌక్‌లో చేసుకోవాలి. అంతేకానీ రోడ్డుపై కూర్చుని మా నాయకులపై దాడి చేస్తామంటే చూస్తూ ఊరుకోం. తోలుతీస్తాం. వెల్లంపల్లి శ్రీనివాస్ ఎక్కడ కనిపిస్తే అక్కడ కట్టేస్తాం" అని హెచ్చరించారు. ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే ఇకపై సహించేది లేదని, ప్రతిఘటన తప్పదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.