అంతర్జాతీయ మార్కెట్లలో భారత ఎగుమతిదారుల పోటీతత్వం ఏమాత్రం తగ్గలేదని, ముఖ్యంగా వర్ధమాన ఆర్థిక వ్యవస్థలలో సరికొత్త అవకాశాలు మెండుగా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ (FIEO) హైదరాబాద్ వేదికగా ‘ఎగుమతి అవకాశాలు - ఎగుమతి వ్యాపారం ప్రారంభించడం’ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించిన సదస్సులో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

ఈ సదస్సులో లాజిస్టిక్స్ నిపుణుడు కమల్ జైన్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ వాణిజ్యానికి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు వెన్నెముక వంటివని, ఇవి సుంకాలను తగ్గించి వాణిజ్య లావాదేవీలను సులభతరం చేస్తాయని వివరించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్త డిమాండ్ సంప్రదాయ మార్కెట్ల నుంచి వర్ధమాన దేశాల వైపు మళ్లుతోందని ఆయన తెలిపారు. ఈ-కామర్స్, పోస్టల్ సర్వీసులు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా చిన్న తరహా వ్యాపారులు, స్టార్టప్‌లు సైతం అంతర్జాతీయ వాణిజ్యంలోకి ప్రవేశించవచ్చని సూచించారు. ఎగుమతిదారులు ప్రధానంగా ఉత్పత్తుల నాణ్యత, నిబంధనల పాటింపు, బ్రాండింగ్, విశ్వసనీయత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు.

విదేశీ కొనుగోలుదారులు చెల్లింపులు చేయని పక్షంలో ఎదురయ్యే నష్టాల నుంచి రక్షణ కల్పించేందుకు ఈసీజీసీ సంస్థ రుణ బీమా సదుపాయాన్ని అందిస్తుందని ఆ సంస్థ ఏజీఎం అమిత్ కుమార్ వెల్లడించారు. ఎగుమతిదారులు ఈ సేవలను వినియోగించుకుంటూ కొత్త మార్కెట్లను అన్వేషించాలని ఆయన సూచించారు. ఐసీఐసీఐ బ్యాంక్ జోనల్ మేనేజర్ శ్రీనివాస్ తూటికొండ మాట్లాడుతూ.. ఎగుమతిదారుల సౌకర్యార్థం ఆన్‌లైన్ ద్వారా కరెన్సీ ట్రాకింగ్, ఫారెక్స్ సేవలను బ్యాంకులు అందుబాటులోకి తీసుకువచ్చాయని పేర్కొన్నారు.

భారత ఆర్థిక వృద్ధిలో రాష్ట్రాల నుంచి జరిగే ఎగుమతులు అత్యంత కీలకమని ఎఫ్ఐఈవో తెలంగాణ చాప్టర్ హెడ్ ఆర్. కులకర్ణి అన్నారు. ఎగుమతిదారులకు అవసరమైన విధానపరమైన సహకారం, మార్కెట్ సమాచారం వంటి సేవలను ఎఫ్ఐఈవో  అందిస్తుందని, ఎగుమతిదారులు ఇందులో సభ్యత్వం తీసుకోవాలని ఆయన ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ వాణిజ్య విధానాలు, ఫైనాన్స్, మార్కెట్ ఎంపిక, కొనుగోలుదారులను గుర్తించడం, డాక్యుమెంటేషన్ వంటి పలు కీలక అంశాలపై నిపుణులు అవగాహన కల్పించారు.