ఇటీవల హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కలకలం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో ఓ తండ్రి తన కన్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం, సుమారు 45 ఏళ్ల నిందితుడు తన భార్య, ముగ్గురు కుమార్తెలతో కలిసి సనత్‌నగర్‌లో నివసిస్తూ హౌస్‌కీపింగ్‌ పని చేసేవాడు. అతడికి మద్యం సేవించే అలవాటు ఉండటంతో తరచూ కుటుంబ సభ్యులతో గొడవలు జరిగేవని సమాచారం.

ఈ క్రమంలో మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో మద్యం మత్తులో తన రెండో కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. కుటుంబ పరువు పోతుందనే భయంతో తొలుత ఈ విషయం బయటకు రాలేదని పోలీసులు తెలిపారు. అయితే వేధింపులు కొనసాగడంతో బాలిక చివరకు సనత్‌నగర్‌ పోలీసులను ఆశ్రయించింది.

బాలిక ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.