బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద విషాదం చోటుచేసుకుంది. ఆయనకు భద్రత కల్పిస్తున్న పోలీసు సిబ్బందిలో ఒకరు విధి నిర్వహణలో ఉండగానే కుప్పకూలి మరణించారు. మృతుడిని 41 ఏళ్ల కానిస్టేబుల్ గణేశ్‌గా గుర్తించారు.  

సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం, సల్మాన్ ఖాన్ నివాసం వద్ద భద్రతా విధుల్లో ఉన్న కానిస్టేబుల్ గణేశ్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. వెంటనే తోటి సిబ్బంది ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. గణేశ్ గుండెపోటుతో మరణించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో సల్మాన్ ఖాన్‌కు ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్‌పై పగతో ఉన్న బిష్ణోయ్, ఆయనను టార్గెట్ చేస్తానని బహిరంగంగానే హెచ్చరించాడు. ఈ ఏడాది ప్రారంభంలో సల్మాన్ ఇంటిపై ఇద్దరు దుండగులు కాల్పులు జరపడం కలకలం రేపింది. ఈ దాడి వెనుక బిష్ణోయ్ ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.

గతంలో తన భద్రతపై సల్మాన్ స్పందిస్తూ "కొన్నిసార్లు ఇంత మంది భద్రతతో తిరగడం ఇబ్బందిగా ఉంటుంది. కానీ అంతా దేవుడిపైనే భారం వేశాను" అని వ్యాఖ్యానించారు.