అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన హర్మూజ్ జలసంధి తూర్పు ముఖద్వారం వద్ద మరోసారి ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం సాయంత్రం ఓ వాణిజ్య నౌకపై దాడి జరగడంతో అందులో భారీగా మంటలు చెలరేగాయి. నౌక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తూ, సహాయం కోసం అత్యవసర సందేశాలు పంపారు.

చైనాకు చెందిన జిన్హువా వార్తా సంస్థ సేకరించిన ఓడల మధ్య రేడియో సంభాషణల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఒమన్ తీరానికి సమీపంలో ప్రయాణిస్తుండగా ఈ దాడి జరిగిందని, దీంతో నౌక ఇంజిన్ రూమ్‌లో మంటలు వ్యాపించాయని సిబ్బంది తెలిపారు. నౌకలోని కార్బన్ డయాక్సైడ్ ఫైర్ సప్రెషన్ సిస్టమ్‌ను యాక్టివేట్ చేసినప్పటికీ, హైడ్రాలిక్ వ్యవస్థ విఫలం కావడంతో మంటలను అదుపు చేయడం కష్టంగా మారింది. సహాయం కోసం వారు చేసిన అభ్యర్థన మేరకు, సమీపంలోని ఇతర నౌకలు ఘటనా స్థలానికి బయలుదేరినట్లు కూడా సంభాషణల్లో రికార్డయింది.

ఇటీవలి కాలంలో హర్మూజ్ జలసంధి పరిసరాల్లో, ముఖ్యంగా ఒమన్ వైపు ఉన్న షిప్పింగ్ మార్గాల్లో నౌకలపై దాడులు పెరిగాయి. అమెరికా-ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ కీలక జలమార్గంలో వాణిజ్య నౌకల రాకపోకలు దాదాపు స్తంభించాయి. ఒమన్ తీరానికి సమీపంలోని మార్గాలను ఉపయోగించాలని అమెరికా సైన్యం సూచించినప్పటికీ, ఆ మార్గాల్లో ప్రయాణిస్తున్న నౌకలపై కూడా ఇరాన్ దాడులకు పాల్పడుతూ, జలమార్గంపై తన ఆధిపత్యం చాటుకునే ప్రయత్నం చేస్తోంది.