అడవిలో పులి కనిపించకపోయినా.. దాని జాడను గుర్తించే కొత్త మార్గాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పులి, చిరుత వదిలే మలమూత్రాల వాసన ఆధారంగా వాటి జాతి, వయసు, లింగం, పునరుత్పత్తి స్థితిని గుర్తించే పద్ధతిని ‘నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ బయోలాజికల్‌ సైన్సెస్‌’ (ఎన్‌సీబీఎస్‌) పరిశోధకులు అభివృద్ధి చేశారు.

వాసనలో దాగిన సమాచారం
పులులు, చిరుతలు తమ పరిధిని గుర్తించేందుకు చెట్లపై మూత్రం చిమ్ముతుంటాయి. మలాన్ని కూడా వదులుతుంటాయి. వీటిలో ఉండే ‘వోలటైల్‌ ఆర్గానిక్‌ కాంపౌండ్స్‌’ ప్రత్యేక రసాయన సంకేతాలను కలిగి ఉంటాయి. వీటిని విశ్లేషించడం ద్వారా జంతువు గురించి కీలక సమాచారం తెలుసుకోవచ్చని పరిశోధకులు గుర్తించారు.

బెంగళూరు, అహ్మదాబాద్‌, వడోదరలోని జంతు ప్రదర్శనశాలల్లో పులులు, చిరుతల నుంచి నమూనాలు సేకరించారు. రాజస్థాన్‌లోని రణథంబోర్‌ టైగర్‌ రిజర్వ్‌లో పులుల నుంచి కూడా నమూనాలు తీసుకున్నారు. అత్యాధునిక రసాయన విశ్లేషణ పద్ధతులు, మెషీన్‌ లెర్నింగ్‌ను ఉపయోగించి వందలాది నమూనాలను పరిశీలించారు.

గర్భిణి పులులను గుర్తించే అవకాశం
పరిశోధనలో 2-నోననాల్‌ అనే రసాయనం పునరుత్పత్తికి సంబంధించిన సంకేతాలను ఇస్తున్నట్లు తేలింది. గర్భంతో ఉన్న, పిల్లలకు పాలిస్తున్న ఆడ పులుల్లో ఈ రసాయనం ఎక్కువగా కనిపించింది. భవిష్యత్తులో అడవిలో పులి కనిపించకుండానే దాని సంతానోత్పత్తి పరిస్థితిని అంచనా వేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ప్రస్తుతం పులుల లెక్కింపులో కెమెరా ట్రాప్‌లు, జన్యు పరీక్షల వంటి పద్ధతులు ఉపయోగిస్తున్నారు. అయితే వాటితో వయసు, ఆరోగ్యం, పునరుత్పత్తి స్థితిని తెలుసుకోవడం ఎప్పుడూ సాధ్యం కాదు. కొత్త విధానం వాటికి అదనపు సాధనంగా ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

పులుల పరిరక్షణకు కొత్త ఆయుధం
ఎన్‌సీబీఎస్‌ పరిశోధన ‘జర్నల్‌ ఆఫ్‌ కెమికల్‌ ఎకాలజీ’లో ప్రచురితమైంది. ఈ విధానం తక్కువ ఖర్చుతో, జంతువులకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా నమూనాలు సేకరించే అవకాశం కల్పిస్తుంది. భవిష్యత్తులో ఎలుగుబంట్లు, తోడేళ్లు, అడవి కుక్కలు, మంచు చిరుతల వంటి ఇతర అరుదైన జంతువుల పర్యవేక్షణకు కూడా దీన్ని ఉపయోగించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.