టాలీవుడ్ ప్రముఖులు దగ్గుబాటి వెంకటేశ్, సురేశ్ బాబు, రానాలకు తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫిల్మ్‌నగర్‌లోని ప్రసిద్ధ ‘డెక్క‌న్ కిచెన్’ ప్రాపర్టీ వివాదానికి సంబంధించి నాంపల్లి కోర్టులో తమపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసును కొట్టివేయాలని కోరుతూ వారు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ తిరస్కరించారు. వెంకటేశ్, సురేశ్ బాబు, రానాతో పాటు దగ్గుబాటి అభిరామ్, అకౌంటెంట్ గడ్డం విశ్వనాథమ్‌లు సమర్పించిన రద్దు (క్వాష్) పిటిషన్‌లో ఎలాంటి బలమైన కారణాలు లేవని స్పష్టం చేస్తూ కొట్టివేశారు.

 

లీజు గడువు ముగియకముందే దగ్గుబాటి కుటుంబం జీహెచ్ఎంసీ అధికారులతో కుమ్మక్కై తమ ప్రాపర్టీలోకి అక్రమంగా ప్రవేశించిందని, అక్కడి నిర్మాణాలను బలవంతంగా కూల్చివేసి బెదిరింపులకు దిగారని కోరె నందు కుమార్ గతంలో కేసు పెట్టారు. ఇది కేవలం లీజుకు సంబంధించిన సివిల్ వివాదమని, క్రిమినల్ కేసు కాదని నిందితులు వాదించినప్పటికీ... ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు చట్టబద్ధమైన ప్రాతిపదిక లేదని స్పష్టం చేసిన హైకోర్టు, నాంపల్లి కోర్టులోని విచారణ కొనసాగేలా ఆదేశించింది.