2026 ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు, ఔత్సాహికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ అరుదైన దృశ్యం భారతదేశంలో మాత్రం కనిపించదు. మన దేశంలో ఆ సమయానికి రాత్రి అవుతుండటమే ఇందుకు ప్రధాన కారణం.

సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. చంద్రబింబం సూర్యుడిని పూర్తిగా కప్పివేయడంతో పగటిపూట కూడా ఆకాశం చీకటిగా మారి, ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. ఆ సమయంలో నక్షత్రాలు, గ్రహాలు కూడా స్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది. నాసా శాస్త్రవేత్తల కథనం ప్రకారం, సూర్యుడు చంద్రుడి కంటే 400 రెట్లు పెద్దదైనప్పటికీ, అదే స్థాయిలో (400 రెట్లు) దూరంగా ఉండటం వల్ల ఆకాశంలో చంద్రుడు, సూర్యుడు దాదాపు ఒకే పరిమాణంలో కనిపిస్తాయి.

ఈ సంపూర్ణ గ్రహణం గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, స్పెయిన్, పోర్చుగల్‌లోని కొన్ని ప్రాంతాలతో పాటు ఉత్తర రష్యా, అట్లాంటిక్ మహాసముద్రం పరిధిలో కనిపిస్తుంది. ఇక ఉత్తర అమెరికా, కెనడా, యూరప్, వాయువ్య ఆఫ్రికాలోని పలు ప్రాంతాల్లో పాక్షిక సూర్యగ్రహణాన్ని వీక్షించే అవకాశం ఉంది.

భారత కాలమానం ప్రకారం, ఆగస్టు 12 రాత్రి 9:45 గంటలకు ప్రారంభమయ్యే ఈ గ్రహణం, ఆగస్టు 13 తెల్లవారుజామున 2:15 గంటల వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో మన దేశంలో సూర్యరశ్మి ఉండదు కాబట్టి గ్రహణాన్ని వీక్షించే వీలు లేదు. అందువల్ల, గ్రహణం సమయంలో పాటించే సూతక్ కాలం వంటి సాంప్రదాయ నియమాలు మనకు వర్తించవని పండితులు స్పష్టం చేస్తున్నారు. అయితే, ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించాలనుకునే భారతీయులు నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వంటి సంస్థల అధికారిక వెబ్‌సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడవచ్చు.