తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ల్లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. 

ఇక, నిన్న మంగళవారం (జులై 28) ఒక్కరోజే 78,709 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 31,312 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.76 కోట్లుగా నమోదైంది.

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గణాంకాల ప్రకారం, మంగళవారం నాడు 3.97 లక్షల లడ్డూలను విక్రయించారు. అదేవిధంగా, 2.26 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించగా, 2,939 మందికి వైద్య సేవలు అందించారు. భక్తుల రద్దీ దృష్ట్యా, దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది.