విమానయాన సంస్థ ఇండిగో తన 20వ వార్షికోత్సవం సందర్భంగా ప్రయాణికులకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ‘ఇండిగోఫ్రీ’ పేరుతో 20 వేల మంది కస్టమర్లకు ఉచిత టికెట్లు అందించనున్నట్టు వెల్లడించింది. ఒక్కో పీఎన్‌ఆర్‌కు గరిష్ఠంగా రూ.10 వేల వరకు టికెట్ చార్జీని తిరిగి చెల్లించనుంది.

ఈ ఆఫర్ ఆగస్టు 4 నుంచి 6 వరకు ఇండిగో అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్, 6ఎస్కై ఏఐ వర్చువల్ అసిస్టెంట్ ద్వారా బుక్ చేసే దేశీయ విమాన టికెట్లకు మాత్రమే వర్తిస్తుంది.

ఆఫర్ కాలంలో బుకింగ్ చేసిన వారిలో 20 వేల మందిని ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఈ-మెయిల్, వాట్సాప్ ద్వారా ఒక సులభమైన ప్రశ్న పంపిస్తారు. సరైన సమాధానం చెప్పేందుకు మూడు అవకాశాలు ఉంటాయి.

ప్రశ్నకు సరైన సమాధానం చెప్పిన ప్రయాణికులకు టికెట్ చార్జీని గరిష్ఠంగా రూ.10 వేల వరకు తిరిగి చెల్లిస్తారు. ఈ మొత్తం 3 నుంచి 5 పని దినాల్లో వారి ఖాతాకు జమ చేస్తామని ఇండిగో తెలిపింది.

ఈ ఆఫర్ దేశీయ ఎకానమీ క్లాస్, ఇండిగో స్ట్రెచ్ బుకింగ్‌లకు వర్తిస్తుంది. వన్‌వే, రిటర్న్ టికెట్లకు కూడా ఇది అందుబాటులో ఉంటుంది.

ఇండిగో ప్రస్తుతం 430కుపైగా విమానాలతో రోజుకు దాదాపు 2,200 విమాన సర్వీసులు నిర్వహిస్తోంది. దేశీయంగా 95కుపైగా, అంతర్జాతీయంగా 40కుపైగా గమ్యస్థానాలకు సేవలు అందిస్తోంది. 2025 స్కైట్రాక్స్ అవార్డ్స్‌లో భారత్, దక్షిణాసియాలో అత్యుత్తమ విమానయాన సంస్థగా గుర్తింపు పొందింది.