యూఏఈలోని దుబాయ్ జెబెల్ అలీ పారిశ్రామిక ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున వరుస పేలుళ్లు సంభవించాయి. కేవలం 20 నిమిషాల వ్యవధిలో ఏడు పేలుళ్లు చోటుచేసుకున్నట్టు ఇరాన్‌కు చెందిన మెహర్ వార్తా సంస్థ పేర్కొంది. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలముకున్నాయి. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.
జెబెల్ అలీ నౌకాశ్రయం సమీపంలోని పారిశ్రామిక ప్రాంతంలో ఈ పేలుళ్లు జరిగినట్టు సమాచారం. ఇంధన నిల్వలు, సరకు రవాణాకు ఇది కీలక కేంద్రంగా గుర్తింపు పొందింది. అయితే పేలుళ్లకు కారణం ఏమిటన్న విషయంపై యూఏఈ అధికారులు ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. ప్రాణనష్టం, ఆస్తి నష్టంపై కూడా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
పేలుళ్ల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఘటనను చిత్రీకరిస్తున్న ఇద్దరిని యూఏఈ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి.
ఈ పేలుళ్లు యెమెన్ నుంచి ప్రయోగించిన క్షిపణుల వల్లే జరిగాయని మెహర్ వార్తా సంస్థ పేర్కొంది. మరోవైపు, పలుసార్లు పేలుళ్ల శబ్దాలు వినిపించిన విషయాన్ని యూఏఈ మీడియా ధ్రువీకరించినా, వాటికి కారణంపై ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు.
నాసా థర్మల్ ఇమేజరీలో జెబెల్ అలీ పోర్టు సమీపంలోని ఓ గిడ్డంగిలో భారీ అగ్నిప్రమాదం నమోదైనట్టు స్థానిక మీడియా తెలిపింది. ఆ ప్రాంతంలో ఇంధన నిల్వలు ఉండటంతో పేలుళ్ల తర్వాత మంటలు చెలరేగినట్టు భావిస్తున్నారు.
అదే సమయంలో యెమెన్ రాజధాని సనాలో కూడా పేలుళ్ల శబ్దాలు వినిపించినట్టు సమాచారం. అవి వైమానిక దాడుల ఫలితమా, లేక అక్కడి నుంచి క్షిపణులు ప్రయోగించారా అన్న అంశంపై స్పష్టత లేదు.
జెబెల్ అలీపై యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేసి ఉండొచ్చని కొన్ని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఈ ఘటనకు తామే కారణమని హౌతీలు ప్రకటించలేదు. యూఏఈ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నిర్ధారణ చేయలేదు.
ఇరాన్‌కు సంబంధించిన ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఈ ఘటన చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఘటనకు అసలు కారణంపై యూఏఈ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
20 నిమిషాల్లో ఏడు పేలుళ్లు.. దుబాయ్‌లో ఉద్రిక్త పరిస్థితులు..
