ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల కోతలు భారీగా కొనసాగుతున్నాయి. 2026లో ఇప్పటివరకు టెక్‌ కంపెనీలు 1,63,427 ఉద్యోగాలను తొలగించినట్లు ‘ట్రేడింగ్‌ప్లాట్‌ఫామ్స్‌’ నివేదిక తెలిపింది. ఇందులో 91,215 ఉద్యోగాల కోతలకు కృత్రిమ మేధ (ఏఐ) కారణంగా పేర్కొన్నారు.

క్లౌడ్‌, సాస్‌ విభాగంలో అత్యధికంగా 37,492 ఉద్యోగాలు పోయాయి. ఈ-కామర్స్‌, మార్కెట్‌ప్లేస్‌లలో 22,633, ఐటీ సేవల్లో 16,756, సోషల్‌ మీడియాలో 13,592 ఉద్యోగాలు తగ్గాయి. ఎంటర్‌ప్రైజ్‌ సాఫ్ట్‌వేర్‌ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా 13,308 ఉద్యోగాలు కోతకు గురయ్యాయి.

ఎంటర్‌ప్రైజ్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల కోతల్లో 88.6 శాతం అమెరికా కంపెనీల్లోనే నమోదయ్యాయి. అమెరికాలో సిస్కో 4,000 ఉద్యోగాలను తగ్గించింది. ఆ తర్వాత అమ్డాక్స్‌ 2,900, ఆటోడెస్క్‌ 1,000 ఉద్యోగాలను తొలగించాయి.

దేశాల పరంగా అమెరికా తర్వాత ఇజ్రాయెల్‌లో ఎక్కువ కోతలు నమోదయ్యాయి. ఆ తర్వాత భారత్‌, సింగపూర్‌ ఉన్నాయి. ఇజ్రాయెల్‌లోని ‘మండే.కామ్‌’ జులై 22న తన ఉద్యోగుల్లో 20 శాతం, అంటే సుమారు 620 మందిని తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఏఐ ఆధారిత సేవలపై దృష్టి పెట్టేందుకే ఈ మార్పు చేపట్టినట్లు తెలిపింది.

2026లో అత్యధిక ఉద్యోగాలను తగ్గించిన సంస్థగా ఒరాకిల్‌ నిలిచింది. జనవరి నుంచి వివిధ దశల్లో 25,254 ఉద్యోగాలను తగ్గించింది. అమెరికాతో పాటు భారత్‌, కెనడా, మెక్సికోలోనూ ఉద్యోగులపై ఈ కోతల ప్రభావం పడింది.

ఏఐ వైపు కంపెనీలు మారుతున్న నేపథ్యంలో ఉద్యోగాల కోతలను పెట్టుబడిదారులు సానుకూలంగా చూస్తున్నారని ట్రేడింగ్‌ప్లాట్‌పామ్స్‌ విశ్లేషకురాలు స్టానిస్లావా సవిషెవా తెలిపారు. ఏఐపై పెట్టుబడులు పెంచుతున్నామని చెబుతూ ఉద్యోగాల సంఖ్య తగ్గించడం ఇప్పుడు కంపెనీలకు సానుకూలంగా కనిపిస్తోందని పేర్కొన్నారు.