పంట పొలాలకు వెళ్లే దారిని మాయం చేశారంటూ ఆగ్రహించిన గ్రామస్తులు... రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గెస్ట్ హౌస్ కాంపౌండ్ వాల్‌ను నేలమట్టం చేశారు. మెదక్ జిల్లా నార్సింగి మండలం జప్తిశివునూర్‌లో ఈ ఉదయం ఒక్కసారిగా విరుచుకుపడ్డ రైతులు, శతాబ్దాల నాటి ప్రధాన బాటను మూసివేసి కాంపౌండ్ కట్టడంపై తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. గతంలో ఈ సమస్యపై షబ్బీర్ అలీకి మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని... పొలాలకు రాకపోకలు బంద్ కావడంతోనే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్థానికులు మండిపడ్డారు.

 

విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన పోలీసులు గ్రామస్తులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. పోలీసులతో వాగ్వాదానికి దిగిన స్థానికులు తమకు దారి చూపే వరకు వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేయడంతో జప్తిశివునూర్‌లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఊరిలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.