భారత్‌లో పాలిమర్ కరెన్సీ నోట్లను 2028 ఆర్థిక సంవత్సరం నాటికి చలామణిలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ప్రస్తుతం పాలిమర్ నోట్లపై క్షేత్రస్థాయి పరీక్షలు కొనసాగుతున్నాయని చెప్పారు.
ద్రవ్య విధాన సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన మల్హోత్రా.. మార్కెట్‌లోకి తీసుకొచ్చే ముందు పాలిమర్ నోట్ల పనితీరును పూర్తిగా పరిశీలిస్తామని వెల్లడించారు. ఫలితాలను విశ్లేషించిన తర్వాతే విస్తృత స్థాయిలో చలామణిపై తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇటీవల రూ.10, రూ.20 విలువైన పాలిమర్ నోట్ల క్షేత్రస్థాయి పరీక్షలకు ఆర్‌బీఐ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఒక్కో విలువలో 100 కోట్ల నోట్లు విడుదల చేసి వాటి మన్నిక, భారత వాతావరణ పరిస్థితులకు అనుకూలతను పరిశీలించనున్నారు.
సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్లు ఎక్కువకాలం మన్నుతాయని ఆర్‌బీఐ పేర్కొంది. వీటిలో పారదర్శక విండోలు, అధునాతన భద్రతా ఫీచర్లు ఉండటంతో నకిలీ నోట్లను అరికట్టడంలో కూడా ఉపయోగపడతాయని తెలిపింది.
అయితే ప్రస్తుతం కాగితపు నోట్లను పూర్తిగా తొలగించే ప్రతిపాదన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పాలిమర్ నోట్లు ప్రవేశపెడితే అవి ప్రస్తుతం ఉన్న కాగితపు నోట్లతో పాటు చలామణిలో కొనసాగనున్నాయి.
2028 నాటికి పాలిమర్ నోట్లు తీసుకురావడమే లక్ష్యం: ఆర్‌బీఐ..
