అహ్మదాబాద్‌లోని లాల్ దర్వాజా ప్రాంతంలో ఒక రెస్టారెంట్ ఉంది. దాని పేరు ‘న్యూ లక్కీ రెస్టారెంట్’. బయటకు సాధారణ హోటల్‌లా కనిపించినా లోపలికి వెళితే ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే.. అక్కడ కస్టమర్లు కూర్చునే టేబుళ్ల మధ్యలో ఏకంగా 26 సమాధులు ఉన్నాయి. గత 75 ఏళ్లుగా ఈ రెస్టారెంట్ ఇలాగే నడుస్తోంది. అయినా సరే, ఇక్కడికి వచ్చే జనం ఏమాత్రం తగ్గలేదు.

ఈ రెస్టారెంట్ ఏర్పాటు వెనుక ఒక ఆసక్తికర కథ ఉంది. సుమారు 75 ఏళ్ల క్రితం కృష్ణన్ కుట్టీ అనే వ్యక్తి ఈ స్థలాన్ని కొనుగోలు చేసి, రెస్టారెంట్ నిర్మాణం మొదలుపెట్టారు. ఆ సమయంలో అక్కడ ఈ సమాధులు బయటపడ్డాయి. ఇవి 16వ శతాబ్దానికి చెందిన సూఫీ సాధువులు, వారి బంధువులవని స్థానికులు నమ్ముతారు. వాటిని తొలగించడం ఇష్టంలేని కుట్టీ, వాటి చుట్టూ ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేసి, వాటి మధ్య ఖాళీ ప్రదేశంలో టేబుళ్లు వేసి రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఇప్పటికీ ఆ సమాధులను ఎంతో గౌరవంగా చూసుకుంటున్నారు. ప్రతిరోజూ వాటిని శుభ్రపరిచి, తాజా పూలు ఉంచి, ప్రార్థనలు చేస్తారు. దీనికి సమీపంలోనే ఒక దర్గా కూడా ఉంది.

ఈ రెస్టారెంట్ మసాలా చాయ్, బన్ మస్కాకు చాలా ప్రసిద్ధి. స్థానిక కుటుంబాలు, ఉద్యోగులు, విద్యార్థులు, పర్యాటకులు అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారు ఇక్కడికి వస్తుంటారు. ఏదైనా ముఖ్యమైన పని, పరీక్ష లేదా శుభకార్యానికి వెళ్లే ముందు ఇక్కడ టీ తాగితే అదృష్టం కలిసి వస్తుందని చాలామంది బలంగా నమ్ముతారు. ఈ సమాధుల వల్లే తమ వ్యాపారం ఇంతగా వృద్ధి చెందిందని యజమానులు కూడా చెబుతుంటారు.

కాలక్రమేణా ఈ రెస్టారెంట్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ప్రముఖ టీవీ షో ‘తారక్ మెహతా కా ఉల్టా చష్మా’లో దీనిని చూపించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వంటి ప్రముఖులు కూడా ఈ హోటల్‌ను సందర్శించారు. చారిత్రక సమాధులను గౌరవిస్తూ, వాటి మధ్యలో దైనందిన వ్యాపారం కొనసాగించడం ఈ రెస్టారెంట్ ప్రత్యేకత. అందుకే ఇది అహ్మదాబాద్‌లోని ఒక విలక్షణమైన ప్రదేశంగా నిలిచిపోయింది.