ఉద్యోగంలో చేరడం ఎంత ముఖ్యమో.. సరైన సమయంలో అక్కడి నుంచి మారడం కూడా అంతే కీలకం. ఎక్కువ జీతం కోసం మాత్రమే కాదు.. కెరీర్‌లో ఎదుగుదల కోసం కూడా చాలా మంది కొత్త అవకాశాల వైపు చూస్తుండాలి. అయితే ఎప్పుడు ఉద్యోగం మారాలి? ప్రస్తుత ఉద్యోగంలోనే కొనసాగాలా? లేక కొత్త దారి వెతకాలా? అనే సందిగ్ధంలో చాలా మంది ఉంటారు. అలాంటి వారికి టెక్‌ ప్రొఫెషనల్‌, కంటెంట్‌ క్రియేటర్‌ అజయ్‌ సునేజా చెప్పిన మూడు సూచనలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

1. మీ పనికి గుర్తింపు లేకపోతే..
అజయ్‌ సునేజా చెప్పిన తొలి సంకేతం గౌరవం, గుర్తింపుకు సంబంధించినది. ఒక ఉద్యోగి ఎంత కష్టపడినా, ఎంత మంచి పని చేసినా దానికి సంస్థలో విలువ లేకపోతే అది పెద్ద హెచ్చరికగా భావించాలని ఆయన అంటున్నారు. మీరు చేస్తున్న ప్రాజెక్ట్‌పై ఆసక్తి తగ్గిపోవడం, మీ అభిప్రాయాలకు ప్రాధాన్యం లేకపోవడం, చేసిన పనిని ఎవరూ మెచ్చుకోకపోవడం వంటి పరిస్థితులు కనిపిస్తే అక్కడే కొనసాగాలా అనే ప్రశ్న వేసుకోవాలని సూచిస్తున్నారు. ఉద్యోగంలో జీతం ఒక్కటే కాదు, మన పనికి లభించే గౌరవం కూడా అంతే ముఖ్యమని ఆయన అభిప్రాయం.

2. నేర్చుకోవడానికి ఏమీ మిగల్లేదా?
రెండో సంకేతం కెరీర్‌ ఎదుగుదలకు సంబంధించినది. రోజూ అదే పని, అదే బాధ్యతలు, కొత్తగా నేర్చుకునే అవకాశం లేకపోవడం వల్ల చాలామంది ఒకే స్థాయిలో నిలిచిపోతారు. ఉద్యోగంలో కొత్త నైపుణ్యాలు నేర్చుకునే అవకాశం లేకపోతే, పదోన్నతికి మార్గం కనిపించకపోతే, భవిష్యత్తులో ఎదుగుదల సాధ్యం కాదనే భావన కలిగితే కొత్త అవకాశాల కోసం ప్రయత్నించడం మంచిదని సునేజా చెబుతున్నారు. కెరీర్‌లో నిరంతర అభ్యాసం లేకపోతే భవిష్యత్తులో పోటీని తట్టుకోవడం కష్టమవుతుందని ఆయన హెచ్చరిస్తున్నారు.

3. అనుభవానికి తగ్గ జీతం లేకపోతే..
మూడో అంశంగా జీతాన్ని ప్రస్తావించారు. మీ అనుభవం, నైపుణ్యాలకు తగ్గ పారితోషికం అందకపోతే దాన్ని కూడా సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. మార్కెట్‌లో మీ స్థాయి ఉద్యోగులకు ఎక్కువ వేతనం లభిస్తుంటే, మీరు మాత్రం చాలా తక్కువ ప్యాకేజీతో కొనసాగుతున్నట్లు అనిపిస్తే కొత్త ఉద్యోగం గురించి ఆలోచించాలని చెప్పారు. అయితే కోపంతో లేదా నిరాశతో వెంటనే రాజీనామా చేయొద్దని స్పష్టం చేశారు. ముందుగా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. కొత్త ఉద్యోగానికి సిద్ధం కావాలి. సరైన అవకాశం వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

అజయ్‌ సునేజా వీడియోకు సోషల్‌ మీడియాలో మంచి స్పందన వచ్చింది. ఆయన చెప్పిన మూడు అంశాలు వాస్తవ పరిస్థితులను ప్రతిబింబిస్తున్నాయని చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే ఇవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని, ప్రతి ఒక్కరి కెరీర్‌ పరిస్థితి భిన్నంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఉద్యోగం మారే ముందు వ్యక్తిగత లక్ష్యాలు, ఆర్థిక పరిస్థితి, మార్కెట్‌లో అవకాశాలను కూడా తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవడం మంచిది.