అయోధ్య రామ మందిరానికి వచ్చిన విరాళాలపై వస్తున్న ఆరోపణలను ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. రూ.3,300 కోట్ల విరాళాల వినియోగంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశాయి. మొత్తం నిధులకు స్వతంత్ర ఆడిటర్లు పూర్తిస్థాయిలో లెక్కలు పరిశీలించి ధ్రువీకరించారని వెల్లడించాయి.

ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు వచ్చిన రూ.3,300 కోట్ల విరాళాలపై ఎం/ఎస్ వి శంకర్ అయ్యర్ అండ్ కో సంస్థ ఆడిట్ నిర్వహించింది. ఆలయ నిర్మాణానికి రూ.1,800 కోట్లు, భూసేకరణకు రూ.400 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. ఈ చెల్లింపులన్నీ బ్యాంకుల ద్వారానే జరిగాయని, నగదు లావాదేవీలు లేవని పేర్కొంది.

ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటన నగదు లెక్కించే సమయంలో జరిగిన చోరీ మాత్రమేనని ప్రభుత్వ వర్గాలు వివరించాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమించిన సైనిక్ సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థకు చెందిన ఆరుగురు సిబ్బంది నగదు దొంగిలించినట్లు సీసీటీవీ ఆధారంగా గుర్తించి వెంటనే అరెస్టు చేసినట్లు తెలిపాయి. వారికి ఆలయ ట్రస్ట్‌తో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాయి.

ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం పనితీరును సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తోందని వెల్లడించాయి. సీనియర్ ఐపీఎస్ అధికారులు విచారణ చేపడుతున్నారని తెలిపాయి.

భూసేకరణలో కూడా నగదు చెల్లింపులు జరగలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అన్ని చెల్లింపులు అధికారిక బ్యాంకు ఖాతాల ద్వారానే జరిగాయని చెప్పాయి. తీర్పు తర్వాత భూముల ధరలు పెరగడం, వాణిజ్య భవనాల పరిహారం కారణంగా వ్యయం అధికంగా కనిపించిందని వివరించాయి.

జూన్ 2026లో జరిగిన ఘటన తర్వాత కూడా భక్తుల విరాళాలు తగ్గలేదని వెల్లడించాయి. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నెలకు సగటున రూ.5 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు తెలిపాయి.