దేశవ్యాప్తంగా సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల భద్రతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) కింద రూ.364 కోట్ల వ్యయంతో లక్ష ఫిషింగ్ పడవలకు ట్రాన్స్‌పాండర్లను అమర్చేందుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర మత్స్యశాఖ గురువారం జాతీయ స్థాయి కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) దేశీయంగా అభివృద్ధి చేసిన వెసెల్ కమ్యూనికేషన్ అండ్ సపోర్ట్ సిస్టమ్ (వీసీఎస్ఎస్) ద్వారా ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా ఫిషింగ్ నౌకలపై ట్రాన్స్‌పాండర్లను అమర్చడంతో పాటు అవసరమైన ఎర్త్ స్టేషన్లు, 'నాభ్‌మిత్ర' అనే ప్రత్యేక అప్లికేషన్‌ను ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తేనున్నారు. అర్హులైన మత్స్యకారులకు ఈ ట్రాన్స్‌పాండర్లను ఉచితంగా అందిస్తారు. ఈ ప్రాజెక్టు వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో భరించనుండగా, కేంద్ర పాలిత ప్రాంతాలకు 100 శాతం నిధులను కేంద్రమే సమకూరుస్తుంది.
ఈ వ్యవస్థ ద్వారా మత్స్యకారులకు ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయి. 'నాభ్‌మిత్ర' యాప్ ద్వారా పడవ ఎక్కడుందో గుర్తించడం, వాతావరణం, తుఫాను హెచ్చరికలు పొందడం, అత్యవసర సమయాల్లో ‘ఎస్‌వోఎస్’ సందేశాలు పంపడం వంటివి చేయవచ్చు. పొరపాటున ఇతర దేశాల సముద్ర జలాల్లోకి ప్రవేశించకుండా ఈ వ్యవస్థ హెచ్చరిస్తుంది. అలాగే, చేపలు ఎక్కువగా లభించే ప్రాంతాల సమాచారాన్ని కూడా అందిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న 1,547 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లలో 423 కేంద్రాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేశారు. అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇవి 350 ఉన్నట్టు ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి.
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద రూ.364 కోట్లు కేటాయింపు..
