ప్రీమియం లైఫ్‌స్టైల్‌ పికప్‌ ట్రక్‌ల విభాగంలో టయోటా తన హైలక్స్‌ ఫేస్‌లిఫ్ట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రారంభ ఎక్స్‌షోరూమ్‌ ధరను రూ.32 లక్షలుగా నిర్ణయించింది. ఈ అప్‌డేటెడ్‌ మోడల్‌లో కొత్త ఫీచర్లు, స్వల్ప డిజైన్‌ మార్పులతో పాటు తొలిసారిగా 4x2 ఆటోమేటిక్‌ వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఇప్పటివరకు కేవలం 4x4 మోడళ్లకే పరిమితమైన హైలక్స్‌ ఇప్పుడు మరింత మంది కొనుగోలుదారులకు చేరువ కానుంది.

బయటి డిజైన్‌లో హైలక్స్‌ కొన్ని మార్పులు చేసింది. కొత్త డైమండ్‌ కట్‌ అల్లాయ్‌ వీల్స్‌, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్‌తో పాటు డీఆర్‌ఎల్‌లు, ఫ్రంట్‌ ఫాగ్‌ ల్యాంప్స్‌ ఇచ్చింది. వెనుక కార్గో డెక్‌పైకి సులభంగా ఎక్కడానికి బోర్డింగ్‌ స్టెప్‌, టెయిల్‌గేట్‌ అసిస్ట్‌ ఫంక్షన్‌, లాక్‌ చేసే రియర్‌ డోర్‌ను కూడా జోడించింది. సల్ఫర్‌ మెటాలిక్‌, ప్లాటినమ్‌ పెర్ల్‌ వైట్‌ మెటాలిక్‌, అటిట్యూడ్‌ బ్లాక్‌, యాష్‌, ఎమోషనల్‌ రెడ్‌, సూపర్‌ వైట్‌ కలిపి మొత్తం ఆరు రంగుల్లో ఈ పికప్‌ అందుబాటులో ఉంటుంది.

క్యాబిన్‌లో కూడా గణనీయమైన మార్పులు చేసింది. 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌తో పాటు టయోటా ఐ-కనెక్ట్‌ కనెక్టెడ్‌ కార్‌ టెక్నాలజీని అందించింది. 360 డిగ్రీల కెమెరా, పార్కింగ్‌ సపోర్ట్‌, టైర్‌ ప్రెజర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (టీపీఎంఎస్‌) వంటి ఫీచర్లు కొత్తగా వచ్చాయి. భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్‌, ఈబీడీ, బ్రేక్‌ అసిస్ట్‌, జీఓఏ బాడీ స్ట్రక్చర్‌ను స్టాండర్డ్‌గా అందించింది. ఆఫ్‌రోడ్‌ ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని 4x4 వేరియంట్లలో మల్టీ టెర్రెయిన్‌ సెలెక్ట్‌, డౌన్‌హిల్‌ అసిస్ట్‌ కంట్రోల్‌, అధునాతన ఫోర్‌వీల్‌ డ్రైవ్‌ మోడ్‌లను కొనసాగించింది.

ఇంజిన్‌లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. 2.8 లీటర్‌ జీడీ డీజిల్‌ ఇంజిన్‌తో పాటు 6-స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ను కొనసాగించింది. ఈ ఇంజిన్‌ 204 హెచ్‌పీ శక్తి, 500 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ విభాగంలో అత్యంత శక్తిమంతమైన పికప్‌లలో హైలక్స్‌ ఒకటిగా నిలుస్తోంది. కొత్తగా తీసుకొచ్చిన GX 4x2 ఆటోమేటిక్‌ వేరియంట్‌ ఈ మోడల్‌లో ప్రధాన ఆకర్షణగా మారింది. పూర్తి స్థాయి ఆఫ్‌రోడింగ్‌ అవసరం లేకపోయినా హైలక్స్‌ స్టైల్‌, విశ్వసనీయత కోరుకునే వినియోగదారులను ఇది ఆకట్టుకునే అవకాశముందని టయోటా భావిస్తోంది.