రూ.4 కోట్ల విలువైన భూకబ్జా కేసులో మాజీ స్పీకర్, వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు బుధవారం ఉదయం 10 గంటలకు ఆయన పోలీసుల ముందు విచారణకు రాగా, అధికారులు ఆయనను సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు.
ఈ కేసు వివరాల్లోకి వెళితే... బతికున్న భూ యజమానిని చనిపోయినట్లు నకిలీ పత్రాలు సృష్టించి, ఒడిశాకు చెందిన ఒక మహిళను ఏకైక వారసురాలిగా తెరపైకి తెచ్చి కబ్జాకు కుట్ర పన్నిన వ్యవహారంలో తమ్మినేని సీతారాం (A6), ఆయన భార్య వాణిశ్రీ (A7), కొడుకు వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగ్ (A5) నిందితులుగా ఉన్నారు. కేసు నమోదైన వెంటనే ఆముదాలవలసలోని తమ నివాసం నుంచి ప్రైవేట్ వాహనంలో పరారైన తమ్మినేని కుటుంబం కోసం అప్పట్లో పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.
ఈ క్రమంలో ముందస్తు బెయిల్ కోసం వీరు హైకోర్టును ఆశ్రయించగా... తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణిశ్రీలకు తాత్కాలిక మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరైంది. విచారణకు పూర్తిగా సహకరించాలని, దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలని స్పష్టం చేస్తూ, సహకరించకపోతే బెయిల్ రద్దు చేస్తామని కోర్టు హెచ్చరించింది. ప్రధాన బెయిల్ పిటిషన్‌పై విచారణను ఆగస్టు 17కి వాయిదా వేసింది. అయితే, తమ్మినేని తనయుడు వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగ్‌కు మాత్రం హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చడంతో ప్రస్తుతం ఆయన పరారీలోనే ఉన్నారు.
