భారతీయ పర్యాటకులకు గుడ్‌న్యూస్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాను సందర్శించేందుకు ఇప్పుడు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా ఆన్‌లైన్‌లోనే టికెట్లు బుక్ చేసుకోవచ్చు. యూఏఈలో ఈ-కామర్స్ లావాదేవీల కోసం యూపీఐ చెల్లింపులను స్వీకరిస్తున్న తొలి సంస్థగా బుర్జ్ ఖలీఫా నిలిచింది.

ఈ సేవలను ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్ఐపీఎల్‌), నియోపే (NEOPAY), ఈమార్ ఎంటర్‌టైన్‌మెంట్ భాగస్వామ్యంతో ప్రారంభించినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కొత్త సదుపాయంతో భారత పర్యాటకులు యూఏఈకి ప్రయాణానికి ముందే బుర్జ్ ఖలీఫా అధికారిక వెబ్‌సైట్ నుంచి తమకు నచ్చిన యూపీఐ యాప్‌తో సులభంగా టికెట్లు కొనుగోలు చేయవచ్చు.

యూఏఈలో 2022లోనే క్యూఆర్ కోడ్ ఆధారిత యూపీఐ చెల్లింపులు అందుబాటులోకి వచ్చాయి. నియోపే నెట్‌వర్క్‌లోని వ్యాపార సంస్థల వద్ద భారత పర్యాటకులు యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. ఇప్పుడు ఈ సేవలను ఆన్‌లైన్ బుకింగ్స్‌కు కూడా విస్తరించారు.

ఈ సందర్భంగా ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ ఎండీ, సీఈఓ రితేశ్‌ శుక్లా మాట్లాడుతూ.. "విదేశాలకు వెళ్లినప్పుడు భారత పర్యాటకులు సులభమైన, సుపరిచితమైన చెల్లింపు అనుభవాన్ని కోరుకుంటున్నారు. ఈ సదుపాయంతో వారు యూఏఈకి రాకముందే తమకు అలవాటైన యూపీఐతో టికెట్లు బుక్ చేసుకోవచ్చు" అని తెలిపారు. 

గల్ఫ్ దేశాల్లో ఈ-కామర్స్ కోసం యూపీఐ సేవలను ప్రారంభించిన తొలి సంస్థ తమదేనని నియోపే సీఈఓ విభోర్ ముంధాడా అన్నారు. తమ వద్దకు అత్యధికంగా వచ్చే అంతర్జాతీయ సందర్శకులలో భారతీయులు ఒకరని, ఈ కొత్త విధానం వారి బుకింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తుందని ఈమార్ ప్రతినిధి పేర్కొన్నారు.