జులై 20న జరిగిన ‘సంసద్‌ చలో’ విద్యార్థుల నిరసనలో మెటాలిక్‌ పెల్లెట్‌ గన్స్‌ వినియోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శాంతియుతంగా నిరసన తెలిపే వారిపై అధిక బలప్రయోగం జరిగిందన్న ఆరోపణలను పరిశీలించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. అయితే పెల్లెట్‌ గన్స్‌పై పూర్తిస్థాయి నిషేధం కోరడం కాకుండా, వాటి వినియోగాన్ని అనుమతిస్తున్న పోలీసు నిబంధనలనే సవాల్‌ చేస్తూ పిటిషన్‌ను సవరించాలని పిటిషనర్లకు సూచించింది. గాయపడిన విద్యార్థులు, ఇతర బాధితులకు అవసరమైన వైద్య చికిత్స అందించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్‌ వి. మోహనతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. మాజీ ఇంటెలిజెన్స్‌ బ్యూరో ప్రత్యేక డైరెక్టర్‌ యశోవర్ధన్‌ ఆజాద్‌తో పాటు పెల్లెట్‌ గాయాలు అయ్యాయని చెప్పిన మరో ఇద్దరు ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. వారి తరఫున న్యాయవాది వృందా గ్రోవర్‌ వాదనలు వినిపించారు. రబ్బరు, ప్లాస్టిక్‌ పెల్లెట్‌లకు, మెటాలిక్‌ పెల్లెట్‌లకు స్పష్టమైన తేడా ఉందని, ఈ కేసు పూర్తిగా మెటాలిక్‌ పెల్లెట్‌ల వాడకానికే సంబంధించినదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

గాయపడిన నిరసనకారుల వైద్య చికిత్స అంశంపైనా కోర్టు దృష్టి సారించింది. ఒక బాధితుడికి సరైన చికిత్స అందుతున్నా, మరో వ్యక్తికి సంబంధించిన వైద్య రికార్డులు ఆసుపత్రి ఇవ్వలేదని పిటిషనర్లు తెలిపారు. దీనిపై చర్యలు తీసుకోవాలని సొలిసిటర్‌ జనరల్‌ను ధర్మాసనం ఆదేశించింది. అలాగే జులై 20న ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ విధుల రికార్డులు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి వినియోగానికి సంబంధించిన లాగ్‌లు, రిజిస్టర్లు భద్రపరచాలని కేంద్రాన్ని ఆదేశించింది. సంబంధిత రికార్డులన్నీ భద్రంగా ఉంచుతామని కేంద్రం కోర్టుకు హామీ ఇచ్చింది.

విచారణ సందర్భంగా జస్టిస్‌ బాగ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. అసాధారణ పరిస్థితుల్లో దశలవారీ బలప్రయోగంలో భాగంగా పెల్లెట్‌ గన్స్‌ను ఉపయోగించేందుకు పోలీసు నిబంధనలు అనుమతిస్తున్నాయని చెప్పారు. అలాంటి నిబంధనల చట్టబద్ధతను ప్రశ్నించకుండా నేరుగా నిషేధం కోరడం స్పష్టత లేని విజ్ఞప్తిగా కనిపిస్తోందన్నారు. అధిక బలప్రయోగం జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో పెల్లెట్‌ గన్స్‌ వినియోగానికి స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని కోరితే పరిశీలించవచ్చని ధర్మాసనం అభిప్రాయపడింది.

శాంతియుతంగా నిరసన తెలిపే విద్యార్థులపై హింసకు తావు ఉండకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదే సమయంలో కొన్ని సందర్భాల్లో పరిస్థితులకు అనుగుణంగా దశలవారీ చర్యలు అవసరం కావచ్చని పేర్కొంది. పోలీసులు ప్రాణాంతక చర్యలకు వెళ్లాల్సిన అవసరం రాకుండా తగిన ప్రత్యామ్నాయ పరికరాలు, శిక్షణ కల్పించాలని వ్యాఖ్యానించింది. ఘటన జరిగిన సమయంలో పోలీసులు రక్షణ పరికరాలతో సిద్ధంగా ఉన్నారని, అక్కడి పరిస్థితులకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకున్నారని కేంద్రం తరఫున వాదించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తెలిపారు.