తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీకి కంటి చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు కలకత్తా హైకోర్టు మరోసారి అనుమతి నిరాకరించింది. ఇదే అంశంపై రెండు వారాల క్రితం కూడా కోర్టు ఆయన అభ్యర్థనను తిరస్కరించింది.

న్యాయమూర్తి జస్టిస్ సౌగత భట్టాచార్య నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. దేశంలోనే అవసరమైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నప్పుడు విదేశాలకు వెళ్లాల్సిన అవసరం కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. 2016లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అభిషేక్ బెనర్జీ కంటికి గాయమైన సంగతి తెలిసిందే.

అభిషేక్‌పై ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కేసు దర్యాప్తు కొనసాగుతోందని కోర్టు గుర్తుచేసింది. అది పూర్తయ్యే వరకు విదేశీ ప్రయాణానికి అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేసింది.

ఎస్‌ఎస్‌కేఎం ప్రభుత్వ ఆసుపత్రిలో నేత్ర వైద్య విభాగాధిపతిని సంప్రదించాలని, అక్కడ చికిత్స సాధ్యమా కాదా అన్న నివేదిక వచ్చిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని కోర్టు తెలిపింది.

ఈ వ్యవహారంలో అభిషేక్ బెనర్జీ ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌ను వారం రోజుల్లోగా విచారించాలని సుప్రీంకోర్టు ఇటీవల కలకత్తా హైకోర్టుకు సూచించింది.

అభిషేక్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇస్తే దేశం విడిచి వెళ్లిపోయే అవకాశం ఉందని బీజేపీతో పాటు తృణమూల్ తిరుగుబాటు వర్గం ఆరోపించింది. అయితే ఇవన్నీ రాజకీయ ఆరోపణలేనని, ఇది పూర్తిగా వైద్య చికిత్సకు సంబంధించిన అంశమని తృణమూల్ కాంగ్రెస్ స్పష్టం చేసింది.