ఒలింపిక్ పతకాలను అథ్లెట్లు గెలుస్తారని, కానీ ఆ ఒలింపిక్ కలలను సాకారం చేసేది అకాడమీలేనని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. పీవీ సింధు అకాడమీ అలాంటి ఛాంపియన్లను తయారుచేసే గొప్ప సంస్థగా ఎదుగుతుందని ఆయన ఆకాంక్షించారు. బుధవారం విశాఖపట్నంలో 'పీవీ సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్' శంకుస్థాపన కార్యక్రమంలో లోకేశ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ అకాడమీ కేవలం ఒక భవనం కాదని, భావి భారత ఛాంపియన్లకు పునాది అని ఆయన అభివర్ణించారు.
ఈ అకాడమీ ఏర్పాటు వెనుక ఉన్న స్ఫూర్తిదాయక నేపథ్యాన్ని లోకేశ్ వివరించారు. "పీవీ సింధు తన హృదయానికి దగ్గరైన ఒక కలతో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఒక బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మించాలనే తన ఆశయాన్ని పంచుకున్నారు. కానీ, మన ముఖ్యమంత్రి ఎప్పుడూ ఉన్నదాని కంటే గొప్పగా ఆలోచించమని సవాల్ విసురుతారు. ఆయన సింధుతో 'కేవలం బ్యాడ్మింటనే ఎందుకు? అంతకు మించి ఆలోచించు. వివిధ క్రీడల్లో నైపుణ్యం ఉన్న పిల్లలందరికీ శిక్షణ ఇచ్చే ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నిర్మించు' అని ప్రోత్సహించారు. ఈ రోజు మనం చూస్తున్న ఈ బృహత్ కార్యం ఆ దార్శనికతకు ప్రతిరూపం" అని లోకేశ్ తెలిపారు. ఇది కేవలం ఒక సౌకర్యం నిర్మించడం కాదని, ఒక వారసత్వాన్ని నిర్మించడం అని ఆయన అన్నారు.
ప్రభుత్వ విధానాలను వివరిస్తూ, చదువుతో పాటు క్రీడలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని లోకేశ్ స్పష్టం చేశారు. "తరగతి గది జ్ఞానాన్ని నిర్మిస్తే, క్రీడా మైదానం వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది. అందుకే రాష్ట్రంలోని పాఠశాలల్లో శనివారాలను 'నో బ్యాగ్ డే'గా ప్రకటించాం. విద్యార్థులకు నచ్చిన క్రీడను ఎంచుకునే స్వేచ్ఛ ఇచ్చి, వారికి అవసరమైన క్రీడా పరికరాలను అందిస్తున్నాం" అని తెలిపారు. క్రీడలు క్రమశిక్షణ, గౌరవం, ఓటమిని ఎదుర్కొనే ధైర్యాన్ని నేర్పుతాయని, అందుకే ప్రతి బిడ్డ ఒక క్రీడ ఆడాలని ఆయన అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్‌లో సైబర్ సిటీ నిర్మిస్తున్నప్పుడు చాలా మంది సందేహాలు వ్యక్తం చేశారని, కంప్యూటర్లు కడుపు నింపుతాయా అని ప్రశ్నించారని లోకేశ్ గుర్తుచేశారు. "కానీ ఆ ఒక్క భవనం హైదరాబాద్‌లో ఐటీ విప్లవానికి నాంది పలికింది. అదేవిధంగా, ఈ అకాడమీ కూడా ఆంధ్రప్రదేశ్ క్రీడా రంగంలో ఒక విప్లవాత్మక మార్పునకు ఉత్ప్రేరకంగా నిలుస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను" అని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ దత్తాత్రేయకు 18 నెలల గడువు విధిస్తూ, 2028 మే నాటికి రిబ్బన్ కటింగ్ ఉండాలని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌ను కేవలం గొప్ప విద్యార్థులు, పరిశ్రమలకే కాకుండా, గొప్ప క్రీడాకారులను తయారుచేసే గమ్యస్థానంగా మార్చడమే తమ కల అని లోకేశ్ అన్నారు. "ఈ అకాడమీ గేట్ల నుంచి ఒకనాడు ఆశతో అడుగుపెట్టిన చిన్నారి, కొన్నేళ్ల తర్వాత ఒలింపిక్ స్టేడియంలో మన మువ్వన్నెల జెండాను మోస్తుంది. ఆ ప్రయాణం ఇక్కడే ప్రారంభమైందని మనమందరం గుర్తుంచుకుంటాం. 'సింధు చేయగలిగితే, నేను కూడా చేయగలను' అని ప్రతి బిడ్డ నమ్మాలి" అని పిలుపునిచ్చారు. విశాఖను ఎంచుకున్నందుకు సింధుకు కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రభుత్వ పూర్తి మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.
కేవలం బ్యాడ్మింటనే ఎందుకు? సింధుకు చంద్రబాబు సవాల్.. ఆసక్తికర విషయం చెప్పిన లోకేశ్..
