తన మిత్రుడు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి కావడంపై ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన... విజయ్ నాయకత్వంలో తమిళనాట త్వరలోనే మంచి మార్పు వస్తుందనే నమ్మకం తనకు కలిగిందని వ్యాఖ్యానించారు.
విజయ్‌తో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ... తామిద్దరం మంచి స్నేహితులమే అయినప్పటికీ, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఆయనను ఇప్పుడు గౌరవపూర్వకంగా 'సీఎం విజయ్' అనే పిలవాలని అన్నారు. రాజకీయాలను 'రెండు వైపులా పదును ఉన్న కత్తి'గా అభివర్ణించిన మాధవన్... అక్కడ మంచో, చెడో ఏది చేసినా విమర్శించేవారు ఎప్పుడూ ఉంటారని అభిప్రాయపడ్డారు.
అలాగే తన రాజకీయ ప్రవేశంపై వస్తున్న ఊహాగానాలకు స్వస్తి చెబుతూ, తనకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. ప్రజలను నడిపించాలని లేదా పదవులు చేపట్టాలనే ఆశ తనకు లేదని, సినిమా వృత్తి ద్వారానే సమాజానికి తోడ్పడతానని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రతినిధులను గౌరవించడం పౌరుడిగా తన బాధ్యత అని తెలిపారు. కాగా, పారిశ్రామికవేత్త గోపాలస్వామి దొరైస్వామి నాయుడు (G.D. Naidu) బయాలజీ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ‘జీ.డీ.ఎన్’ చిత్రంలో మాధవన్ కథానాయకుడిగా నటిస్తున్నారు.
