మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి రాజకీయాల్లోకి రానున్నట్లు స్పష్టంచేశారు. గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన, త్వరలోనే తన రాజకీయ ప్రస్థానాన్ని తిరిగి ప్రారంభిస్తానని ప్రకటించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన తదుపరి అడుగు ఏంటన్న అంశం చర్చనీయాంశంగా మారింది.  విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, తాను మళ్లీ ప్రజా జీవితంలో చురుకైన పాత్ర పోషించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి విశ్వసనీయమైన రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అదే సమయంలో మీడియా రంగంలో కూడా కొత్త ప్రయత్నాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.  ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్టులు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారా? లేక ఇప్పటికే ఉన్న ఏదైనా రాజకీయ పార్టీలో చేరతారా? అనే అంశాలపై ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ, ఏ పార్టీతో ముందుకు వెళ్తారనే విషయంపై ఆయన ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు.  రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమతూకంగా ముందుకు తీసుకెళ్లే నమ్మకమైన రాజకీయ శక్తి అవసరమని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ రీఎంట్రీ ఏపీ రాజకీయ సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది..