ప్రముఖ సోషల్ మీడియా సంస్థ మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ భారత ప్రభుత్వానికి క్షమాపణలు తెలిపారు. ప్రధాని మోదీ వీడియో తొలగింపు, తమ ప్లాట్‌ఫామ్‌లపై చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్, డీప్‌ఫేక్ కంటెంట్ వ్యాప్తి చెందడంపై ఆయన చింతిస్తున్నట్లు వెల్లడించారు. వీటితో పాటు, తమ ప్లాట్‌ఫామ్‌ల నిర్వహణలో జరిగిన లోపాలను కూడా అంగీకరిస్తూ ఆయన విచారం వ్యక్తం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు బుధవారం వెల్లడించాయి.

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి చెందిన ఓ ఫేస్‌బుక్ పోస్ట్‌ను కొద్దిసేపు తొలగించడంపై పార్లమెంటరీ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ వివాదంపై చర్చించేందుకు మెటా ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఢిల్లీలో ఐటీ కార్యదర్శి ఎస్. కృష్ణన్‌తో సమావేశమైంది. ఈ సందర్భంగా, అభ్యంతరకర, తప్పుడు కంటెంట్ వ్యాప్తిపై భారత ప్రభుత్వం లేవనెత్తిన ఆందోళనలను మెటా ప్రతినిధులు అంగీకరించారని, ప్లాట్‌ఫామ్ నిర్వహణలో జరిగిన పొరపాట్లపై జుకర్‌బర్గ్ క్షమాపణలు చెప్పారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

యూజర్లకు ఏ కంటెంట్ చేరాలనేది ప్లాట్‌ఫామ్‌లే ఎంపిక చేసి పంపిణీ చేస్తున్నప్పుడు, వాటిని కేవలం మధ్యవర్తులుగా పరిగణించలేమని భారత అధికారులు మెటాకు స్పష్టం చేసినట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ఐటీ చట్టం కింద లభించే 'సేఫ్ హార్బర్' రక్షణ వర్తించదని తేల్చిచెప్పారు. కొన్ని రకాల కంటెంట్‌ను ప్రోత్సహించేందుకు (బూస్టింగ్) భారీగా డబ్బులు చెల్లించినట్లు మెటా అంగీకరించిందని, ఈ తప్పులకు విచారం వ్యక్తం చేసిందని కూడా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

ప్రధాని మోదీ పోస్ట్ తొలగింపుపై మూడు రోజుల్లోగా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని పార్లమెంటరీ ప్యానెల్ మెటాను ఆదేశించింది. గడువులోగా స్పందించకపోతే మెటా 'సేఫ్ హార్బర్' రక్షణను కోల్పోతుందని ఐటీ మంత్రిత్వ శాఖ వర్గాలు హెచ్చరించాయి. ఈ పరిణామాల మధ్య మెటా ప్రతినిధులు ఐటీ కార్యదర్శితో భేటీ కావడం, కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కూడా సమావేశం కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.