హాలీవుడ్ సూపర్ హీరో స్పైడర్ మ్యాన్ అభిమానులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కనులవిందు చేస్తోంది. 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' చిత్రంలో పీటర్ పార్కర్, ఎంజేలు విడిపోవడంతో నిరాశ చెందిన అభిమానులకు ఊరటనిస్తూ, వారిద్దరికీ ఘనంగా పెళ్లి జరిపించిన ఒక ఏఐ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పూర్తిగా దక్షిణాది సంప్రదాయంలో జరిగిన ఈ పెళ్లి వేడుక నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఈ వైరల్ వీడియోలో పీటర్ పార్కర్ (టామ్ హాలండ్) సంప్రదాయ పంచెకట్టులో కనిపించగా, ఎంజే (జెండయా) కాంజీవరం పట్టుచీర, తలలో మల్లెపూలతో అచ్చమైన దక్షిణాది వధువులా మెరిసిపోయింది. గుడి వాతావరణం, మంగళవాయిద్యాల నడుమ వీరి వివాహం జరిగినట్లు ఏఐ టెక్నాలజీతో అద్భుతంగా సృష్టించారు.

ఈ పెళ్లి వేడుకకు ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, డాక్టర్ స్ట్రేంజ్ వంటి అవెంజర్స్ హీరోలు అతిథులుగా హాజరయ్యారు. పాత స్పైడర్ మ్యాన్ నటులు టోబీ మాగ్వైర్, ఆండ్రూ గార్ఫీల్డ్ పెళ్లి పనుల్లో సాయం చేస్తూ కనిపించారు. అంతేకాదు, ఎక్స్-మెన్ క్యారెక్టర్ వుల్వరైన్ అతిథులకు అరటి ఆకుల్లో వడ్డన చేస్తుండటం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 'నో వే హోమ్' సినిమాలో తీరని కోరికగా మిగిలిపోయిన పీటర్, ఎంజేల కలయికకు ఈ ఏఐ వీడియో ఒక అందమైన ముగింపు ఇచ్చిందని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.