గూగుల్ మ్యాప్స్ ఇక దారి చూపించే యాప్ మాత్రమే కాదు. ప్రయాణాన్ని మరింత సులభంగా మార్చే కొత్త ఏఐ ఫీచర్లను గూగుల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై హోటల్ బుక్ చేసుకోవడం, రెస్టారెంట్ వెతకడం, ఇష్టమైన వంటకం ఆర్డర్ చేయడం కూడా మ్యాప్స్‌లోనే చేయొచ్చు.

కొత్తగా తీసుకొచ్చిన ‘ఆస్క్ మ్యాప్స్’ ఫీచర్‌తో వినియోగదారులు సాధారణ భాషలో ప్రశ్నలు అడగొచ్చు. ఉదాహరణకు బీచ్‌కు దగ్గరలో కుటుంబంతో ఉండేందుకు తక్కువ ఖర్చుతో మంచి హోటల్ కావాలని అడిగితే, మ్యాప్స్ అందుకు తగ్గ ఎంపికలను చూపిస్తుంది. గదుల లభ్యత, ధరలను కూడా పరిశీలించి సూచనలు ఇస్తుంది.

ప్రయాణంలో ఇష్టమైన ఆహారం కోసం కూడా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. మార్గమధ్యంలో కావాల్సిన వంటకం దొరికే రెస్టారెంట్లను గుర్తించి, అవి తెరిచి ఉన్నాయా లేదా కూడా చెబుతుంది. ఎంపిక చేసిన తర్వాత ఆ వంటకాన్ని నేరుగా కార్ట్‌లో చేర్చే అవకాశం కూడా కల్పించింది.

భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా హిందీ భాషను సపోర్ట్‌ చేసేలా గూగుల్‌ మ్యాప్స్‌ను అప్‌గ్రేడ్‌ చేశారు. ఇక నుంచి ఇంగ్లిష్ అవసరం లేకుండా హిందీలోనే రెస్టారెంట్లు, పర్యాటక ప్రాంతాల గురించి అడిగి సమాచారం తెలుసుకోవచ్చు.

అలాగే పర్సనల్ ఇంటెలిజెన్స్ పేరుతో మరో ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. జీమెయిల్‌లో ఉన్న విమాన టికెట్లు, హోటల్ బుకింగ్ వివరాల ఆధారంగా ప్రయాణానికి తగ్గ సూచనలు ఇస్తుంది. బస్సులు, మెట్రో, రైళ్లు, ఫెర్రీ సేవలపై సమాచారం కూడా అందిస్తుంది.

ఈ కొత్త ఏఐ ఫీచర్లు భారత్‌తో పాటు 150కి పైగా దేశాల్లో దశలవారీగా అందుబాటులోకి వస్తున్నాయి.