నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ)లో ఉన్న భద్రతా లోపాలే ప్రశ్నాపత్రం బయటకు వెళ్లడానికి ప్రధాన కారణమని సీబీఐ పేర్కొంది. ముఖ్యంగా కాన్ఫిడెన్షియల్ విభాగంలో తనిఖీలు లేకపోవడం, సీసీటీవీ పర్యవేక్షణ సరిగా లేకపోవడాన్ని నిందితులు ఆసరాగా చేసుకున్నట్లు తెలిపింది.
సీబీఐ వివరాల ప్రకారం.. ప్రశ్నాపత్రాల అనువాదం, బ్యాక్ ట్రాన్స్‌లేషన్, ప్రూఫ్ రీడింగ్ బాధ్యతలు చూసిన ముగ్గురు సబ్జెక్ట్ నిపుణులు కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్ ప్రశ్నలను పరీక్షకు ముందే బయటకు తీసుకెళ్లారు.
కెమిస్ట్రీ నిపుణుడు పి.వి. కులకర్ణి ప్రశ్నలు, జవాబులను చిన్న కాగితాలపై రాసి రహస్యంగా బయటకు తీసుకెళ్లినట్లు సీబీఐ తెలిపింది. కాన్ఫిడెన్షియల్ విభాగంలో లోనికి వెళ్లే సమయంలో, బయటకు వచ్చే సమయంలో తనిఖీలు లేకపోవడంతో ఇది సాధ్యమైందని పేర్కొంది. కొన్ని ప్రశ్నలను గుర్తుపెట్టుకొని హోటల్‌కు వెళ్లిన తర్వాత రాసుకున్నట్లు వెల్లడించింది.
బయాలజీ నిపుణురాలు మనీషా గురునాథ్ మండారే హోటల్‌కు వెళ్లిన తర్వాత, తనకు గుర్తున్న ప్రశ్నలకు సంబంధించిన ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకంలోని భాగాలను గుర్తు పెట్టి, వాటి ఆధారంగా ప్రశ్నలను పునర్నిర్మించినట్లు సీబీఐ వెల్లడించింది. ఫిజిక్స్ నిపుణురాలు మనీషా హవాల్దార్ కూడా పని ముగిసిన తర్వాత తన నివాసానికి వెళ్లి ప్రశ్నలను రాసుకున్నట్లు తెలిపింది.
ఎన్‌టీఏ కార్యాలయంలో మరో కీలక లోపాన్ని కూడా సీబీఐ గుర్తించింది. సీసీటీవీ రికార్డులు కేవలం 20 నుంచి 25 రోజుల వరకు మాత్రమే ఉండటంతో, ప్రశ్నాపత్రాల తయారీ జరిగిన కాలానికి సంబంధించిన దృశ్యాలు అందుబాటులో లేకపోయాయని తెలిపింది. అలాగే సీసీటీవీలను ప్రత్యక్షంగా పర్యవేక్షించే ప్రత్యేక నియంత్రణ కేంద్రం కూడా లేదని పేర్కొంది.
ఈ కేసులో మొత్తం 13 మందిపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. 360 మంది సాక్షులు, 422 పత్రాలు, 43 ఆధారాలను కోర్టుకు సమర్పించింది. విద్యాశాఖ ఫిర్యాదు మేరకు మే 12న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సీబీఐ, దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించి కీలక ఆధారాలు స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం నిందితులంతా జుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఎలా జరిగింది?.. సీబీఐ చార్జిషీట్‌లో సంచలన విషయాలు..
