కర్ణాటక ప్రతిపాదిత మేకేదాటు డ్యామ్ నిర్మాణం, కావేరి నీటి పంపకాల వివాదంపై తమిళనాడు శాసనసభలో తీవ్ర చర్చ జరిగింది. ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ (DMK) డిమాండ్ చేసిన అఖిలపక్ష సమావేశాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ స్పష్టంగా తోసిపుచ్చారు. కావేరి విషయంలో రాజకీయం చేయవద్దని కోరిన సీఎం విజయ్.. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం, నీటి సాధన కోసం అవసరమైతే తాను ‘అవమానపడటానికి’ కూడా సిద్ధంగా ఉన్నానని అసెంబ్లీలో వ్యాఖ్యానించారు.

 

శాసనసభలో జరిగిన వాడివేడి చర్చలో, కావేరి హక్కుల విషయంలో తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని, ఈ విషయాన్ని ఇప్పటికే ప్రధాని మోదీకి లేఖ ద్వారా తెలియజేశామని సీఎం తెలిపారు. గతంలోనే అఖిలపక్ష తీర్మానం చేసి కేంద్రానికి పంపినందున, మళ్లీ ప్రత్యేకంగా ఆల్‌పార్టీ మీటింగ్ పెట్టాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మాత్రం... డెల్టా రైతులు నీటి కొరతతో తీవ్రంగా నష్టపోతున్నారని, కర్ణాటక మొండివైఖరిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని పార్టీలను ఒకే తాటిపైకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.