ఫుట్‌బాల్‌ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసే విషయం వెలుగులోకి వచ్చింది. అర్జెంటీనా స్టార్‌ లియోనెల్‌ మెస్సీని లక్ష్యంగా చేసుకుని ప్రపంచకప్‌ సమయంలో దాడికి కుట్ర జరిగిందని ఓ పోలీసు నివేదిక వెల్లడించినట్లు సమాచారం. మెస్సీని చంపేందుకు బాంబులతో స్టేడియంలోకి వస్తానంటూ ఓ వ్యక్తి చేసిన బెదిరింపులు భద్రతా సంస్థలను అప్రమత్తం చేసినట్లు స్పానిష్‌ మీడియా కథనం పేర్కొంది.

ప్రపంచకప్‌ సందర్భంగా ఆటగాళ్లు, రిఫరీలు, ఇతర అధికారులకు వచ్చిన బెదిరింపులపై పోలీసులు సిద్ధం చేసిన నివేదికలో మెస్సీ, అర్జెంటీనా జట్టు పేర్లు పలుసార్లు కనిపించినట్లు సమాచారం. వీటిని ఎఫ్‌బీఐ, అంతర్జాతీయ పోలీసు సహకార సంస్థలతో కూడిన భద్రతా బృందం పరిశీలించినట్లు తెలుస్తోంది.

అందులో అత్యంత ఆందోళన కలిగించిన ఘటన మెస్సీని లక్ష్యంగా చేసుకున్నదేనని నివేదిక పేర్కొంది. ఓ వ్యక్తి సామాజిక మాధ్యమంలో తాను అట్లాంటా స్టేడియంలోకి వెళ్లి మెస్సీపై బాంబు దాడి చేస్తానంటూ హెచ్చరించినట్లు సమాచారం. తన శరీరానికి పేలుడు పదార్థాలు కట్టుకుని వస్తానని అతడు పేర్కొన్నట్లు నివేదికలో ఉంది.

ఈ బెదిరింపును అధికారులు చాలా తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. మరో ఘటనలో డల్లాస్‌ విమానాశ్రయానికి ఓ వ్యక్తి ఫోన్‌ చేసి, తాము ముగ్గురం స్టేడియం వైపు వస్తున్నామని చెప్పినట్లు సమాచారం. తమ వద్ద ఇంట్లో తయారు చేసిన బాంబులు, ఏఆర్‌-15 తుపాకీ ఉన్నాయని అతడు చెప్పినట్లు నివేదిక పేర్కొంది. పోలీసులు, ఫుట్‌బాల్‌ ఆటగాళ్లే తమ లక్ష్యాలని కూడా చెప్పినట్లు తెలుస్తోంది.

మెస్సీ ఒక్కరే కాదు.. మరో స్టార్‌ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోకు కూడా ప్రపంచకప్‌ సమయంలో భద్రతాపరమైన సమస్యలు ఎదురైనట్లు నివేదికలో పేర్కొన్నారు. రొనాల్డో ఎక్కడ బస చేస్తున్నాడో తెలుసుకునేందుకు ఓ అనుమానాస్పద వ్యక్తి ప్రయత్నించిన విషయాన్ని జూన్‌ 14న ఫిఫా ఉద్యోగి అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

టొరంటో, హ్యూస్టన్‌, మియామి నగరాల్లోనూ ఇలాంటి ఘటనలు నమోదైనట్లు నివేదిక తెలిపింది. ఫ్రాన్స్‌కు చెందిన రిఫరీ ఫ్రాంకోయిస్‌ లెటెక్సియర్‌కు కూడా ప్రపంచకప్‌ సమయంలో వాట్సాప్‌లో సుమారు ఆరు వేల బెదిరింపు సందేశాలు వచ్చినట్లు పేర్కొంది.

అయితే ఈ వివరాలన్నీ లీకైన పోలీసు నివేదిక ఆధారంగా వెలుగులోకి వచ్చినవే. బెదిరింపులు చేసిన వ్యక్తులు వాస్తవంగా దాడికి సిద్ధపడ్డారా, వారి చర్యలపై ఎలాంటి తదుపరి చర్యలు తీసుకున్నారనే పూర్తి వివరాలు మాత్రం వెల్లడికాలేదు.