ప్రపంచం వేగంగా మారుతోంది.. టెక్నాలజీతో పాటు ఉద్యోగాలు, పరిశ్రమలు కూడా కొత్త రూపం దాలుస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఈ ప్రయాణంలో ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండేవారే భవిష్యత్తులో విజయం సాధిస్తారని అన్నారు.
ఐఐటీ ఢిల్లీ స్నాతకోత్సవంలో శనివారం మోదీ ప్రసంగించారు. ప్రపంచంలో వ్యూహాత్మక మార్పులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. టెక్నాలజీ అభివృద్ధి ఈ మార్పులకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. రాబోయే 20-30 ఏళ్లలో ప్రపంచం ఎలా ఉంటుందో కచ్చితంగా చెప్పలేమన్నారు. అయితే మార్పులు సవాళ్లతో పాటు కొత్త అవకాశాలను కూడా తీసుకొస్తాయని తెలిపారు.
టెక్నాలజీ మారుతుంది.. ఉద్యోగాలు మారతాయి.. కానీ ఈ ఒక్కటే మిమ్మల్ని గెలిపిస్తుంది: మోదీ
ప్రస్తుత తరం యువతకు ప్రత్యేక బాధ్యత ఉందని మోదీ అన్నారు. వచ్చే 30-35 ఏళ్లలో వారు తీసుకునే నిర్ణయాలు ‘వికసిత్ భారత్’ ప్రయాణంపై ప్రభావం చూపుతాయని చెప్పారు. తాము తీసుకునే ప్రతి నిర్ణయం దేశానికి ఎలా ఉపయోగపడుతుందో యువత ఆలోచించాలని సూచించారు.
పరిశోధన, కొత్త ఆలోచనల్లోనూ యువతకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని మోదీ చెప్పారు. ప్రధానమంత్రి రీసెర్చ్ ఫెలోషిప్, రీసెర్చ్ డెవలప్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్ పథకం ద్వారా యువ పరిశోధకులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. జాతీయ పరిశోధనా సంస్థను ఏర్పాటు చేశామని చెప్పారు. పరిశోధన రంగానికి రూ.లక్ష కోట్ల వరకు నిధులు సమకూరుస్తున్నట్లు వెల్లడించారు.
‘వన్ నేషన్.. వన్ సబ్‌స్క్రిప్షన్’ ద్వారా ప్రముఖ అంతర్జాతీయ పరిశోధనా జర్నల్స్ దేశంలోని చిన్న పట్టణాలకూ అదనపు ఖర్చు లేకుండా అందుతున్నాయని మోదీ తెలిపారు. ఐఐటీ ఢిల్లీలో 3,000 మందికి పైగా విద్యార్థులకు పట్టాలు అందించారు. ఇందులో 587 మంది పీహెచ్‌డీ విద్యార్థులు ఉన్నారు.
అదే కార్యక్రమంలో ఐఐటీ ఢిల్లీ సోనిపట్ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ‘పరమ్ ప్రజ్ఞ’ ఏఐ ఆధారిత సూపర్ కంప్యూటింగ్ సదుపాయాన్ని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఇది ఏఐ, డేటా సైన్స్, ఆధునిక కంప్యూటింగ్, పరిశోధనకు ఉపయోగపడనుంది.
ప్రపంచం ఎలా మారుతుందో చెప్పలేం.. కానీ, గెలవాలంటే..: యువతకు మోదీ కీలక సందేశం..
