బోనాల పండుగ సందర్భంగా మందుబాబులకు పోలీసులు బ్యాడ్ న్యూస్ చెప్పారు. పండుగ వేడుకలు ప్రశాంతంగా జరగాలనే ఉద్దేశంతో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నగరంలో మద్యం అమ్మకాలపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 9న జరగనున్న బోనాల ఉత్సవాల నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో నిర్దేశిత సమయాల్లో వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్లను మూసివేయనున్నారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నగరంలో జోన్ల వారీగా ఆంక్షలు అమలులో ఉంటాయి. ముఖ్యంగా చార్మినార్ జోన్‌లో ఆగస్టు 9 ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 11 ఉదయం 10 గంటల వరకు (48 గంటలు) మద్యం దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్‌లు పూర్తిగా మూసివేయనున్నారు. రాజేంద్రనగర్, గోల్కొండ జోన్లలో ఆగస్టు 9 ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు (ఆగస్టు 10) ఉదయం 10 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. అయితే, స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్బుల్లోని బార్లకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కూకట్‌పల్లి, అల్లాపూర్, రాయదుర్గం, జీడిమెట్ల, మేడ్చల్, చందానగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం అమ్మకాలు నిలిపివేయాలని పోలీస్ కమిషనర్ ఆదేశించారు. ఇక, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆగస్టు 9 ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 10 ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయనున్నారు.
బోనాల పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మూడు కమిషనరేట్ల పోలీసులు స్పష్టం చేశారు. పండుగ వేళ వేల సంఖ్యలో భక్తులు, ప్రజలు రోడ్లపైకి వస్తారని, వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ఆంక్షలు విధించామని తెలిపారు. ప్రజలు నిబంధనలు పాటించి, పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
బోనాల పండుగ.. హైదరాబాద్లో మద్యం అమ్మకాలపై ఆంక్షలు..
