వైసీపీ నేత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా బుద్దా నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ఇదే సమయంలో ఆయన జన్మదిన వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ... వెల్లంపల్లి రాజకీయ నాయకుడు కాదని, పైరవీలు చేసుకునే పైరవీల నాయకుడని తీవ్రంగా విమర్శించారు. నియోజకవర్గాన్ని గతంలో తీవ్రంగా చిన్నాభిన్నం చేశారని, రాజకీయ ఊసరవెల్లి అయిన వెల్లంపల్లిని త్వరలోనే ఆయన సొంత పార్టీ నాయకులే పుచ్చిపోయిన వంకాయలతో కొడతారని ఎద్దేవా చేశారు.

 

ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌, టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని పిచ్చి మాటలు మాట్లాడితే సహించేది లేదని బుద్దా వెంకన్న హెచ్చరించారు. పార్టీ కోసం నాలుగడుగులు వెనక్కి తగ్గినా, శత్రువు పైకి వెళ్లేందుకు పది అడుగులు ముందుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, పొలిట్ బ్యూరో సభ్యుడు షరీఫ్‌తో పాటు పలువురు సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.