ట్రాఫిక్‌ పోలీసులు చలాన్‌ విధిస్తే అక్కడికక్కడే జరిమానా చెల్లిస్తే విషయం ముగిసిపోతుందని చాలామంది భావిస్తారు. కానీ అన్నిసార్లు అది సాధ్యం కాదు. కొన్ని తీవ్రమైన ఉల్లంఘనలకు కోర్టు చలాన్‌ జారీ చేస్తారు. అలాంటి సందర్భాల్లో జరిమానా వసూలు చేసే అధికారం పోలీసులకు ఉండదు. నేరుగా కోర్టుకు వెళ్లి అక్కడే తుది నిర్ణయం తీసుకుంటారు.

ట్రాఫిక్‌ చలాన్లు సాధారణంగా రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి సాధారణ లేదా కాంపౌండబుల్‌ చలాన్‌. ఇందులో నిర్ణయించిన జరిమానా చెల్లిస్తే కేసు ముగుస్తుంది. రెండోది కోర్టు చలాన్‌. ఇందులో ఉల్లంఘన తీవ్రత ఎక్కువగా ఉండటంతో విషయం న్యాయస్థానం పరిధిలోకి వెళ్తుంది.

ప్రమాదకరంగా లేదా నిర్లక్ష్యంగా వాహనం నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్‌ చేయడం, వన్‌వే రోడ్డులో రాంగ్‌రూట్‌లో వెళ్లడం, తప్పనిసరి స్టాప్‌ సిగ్నళ్లను పట్టించుకోకపోవడం, ప్రమాదకర ఓవర్‌టేకింగ్‌, మైనర్లతో వాహనాలు నడిపించడం, ఫుట్‌పాత్‌లు లేదా సైకిల్‌ ట్రాక్‌లపై వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలకు కోర్టు చలాన్‌ పడే అవకాశం ఉంటుంది.

ఇలాంటి చలాన్‌ వస్తే దానిని సాధారణ జరిమానాగా తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. నోటీసులో పేర్కొన్న కోర్టు, విచారణ తేదీ, తదుపరి చర్యలను జాగ్రత్తగా పరిశీలించాలి. కోర్టు సమన్లు లేదా నోటీసులను నిర్లక్ష్యం చేస్తే అదనపు న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

ఇటీవల తెలంగాణ హైకోర్టు కూడా పెండింగ్‌ చలాన్లను అక్కడికక్కడే చెల్లించమని వాహనదారులను పోలీసులు బలవంతం చేయరాదని స్పష్టం చేసింది. చట్టంలోని ప్రక్రియను తప్పనిసరిగా అనుసరించాలని పేర్కొంది. కొన్ని రాష్ట్రాలు కూడా ఈ-చలాన్ల వసూళ్ల విషయంలో బలవంతపు చర్యలు తీసుకోవద్దని ట్రాఫిక్‌ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాయి.

అందుకే ట్రాఫిక్‌ చలాన్‌ వచ్చిందంటే అది సాధారణ జరిమానానా, లేక కోర్టు చలానా అనే విషయాన్ని ముందుగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే చిన్న ట్రాఫిక్‌ ఉల్లంఘన అనుకున్న విషయం న్యాయపరమైన చిక్కులకు దారితీయొచ్చు.